IND Vs ENG: హైదరాబాద్ టెస్ట్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు.. భారత్లో సిరీస్ పట్టేయడం ఈజీ అనుకుంది.. బజ్ బాల్ ఆట ద్వారా భారత జట్టును సులభంగా ఓడించొచ్చని భావించింది. కానీ ఆ తర్వాత జరిగింది వేరు. ఒకటి కాదు, రెండు కాదు వరుసగా నాలుగు ఓటములు.. ఫలితం సిరీస్ భారత్ దక్కించుకుంది..4-1 సగర్వంగా ట్రోఫీని ఎత్తుకుంది. అయితే ఇంతటి భారీ ఓటమిలోనూ ఇంగ్లాండు జట్టుకు ఆ విషయమే ఒకింత ఓదార్పునిస్తోంది.
మూడవ స్థానంలో..
ధర్మశాల వేదికగా జరిగిన ఐదవ టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రాంచీలో 106 పరుగుల వ్యత్యాసంతో ఓడిపోయింది. రాజ్ కోట్ లో జరిగిన టెస్టులో 434 పరుగుల తేడాతో పరాజయం పాలయింది. ఇలా వరుస ఓటములు ఎదుర్కొని ఇంగ్లాండ్ జట్టు అభాసు పాలైంది. అదే ఇలాంటి తరుణంలో ఆ జట్టు బౌలర్ అండర్సన్ అరుదైన ఘనత సాధించాడు. ఇదొక్కటే ఇంగ్లాండ్ జట్టుకు సానుకూల అంశంగా మారింది. ధర్మశాల వేదికగా జరిగిన టెస్ట్ లో కులదీప్ ను అవుట్ చేయడం ద్వారా 41 సంవత్సరాల ఇంగ్లాండ్ పేసర్ అండర్సన్ టెస్ట్ క్రికెట్లో 700 వికెట్లు తీసిన బౌలర్ గా ఘనత సాధించాడు. 348 ఇన్నింగ్స్ లు ఆడి అతడు ఈ రికార్డు సృష్టించాడు. అతనికంటే ముందు ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్నర్ షేన్ వార్న్ ముందున్నాడు. అతడు 273 ఇన్నింగ్స్ ల్లో 708 వికెట్లు తీశాడు. ఇక ఈ జాబితాలో ముత్తయ్య మురళీధరన్ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. అతడు కేవలం 230 ఇన్నింగ్స్ లోనే 800 వికెట్లు తీసి అరుదైన రికార్డు తన పేరు మీద లిఖించుకున్నాడు.
21 సంవత్సరాల క్రితం..
అండర్సన్ 2003లో లార్డ్స్ వేదికగా జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 21 సంవత్సరాలుగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నాడు. ప్రస్తుతం ఇండియా తో ధర్మశాల వేదికగా ఆడిన మ్యాచ్ అతని కెరియర్లో 187 వది. ధర్మశాల టెస్ట్ లో అతడు రెండు వికెట్లు తీయడం ద్వారా 700 వికెట్ల ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ లో అతడు గిల్, కులదీప్ యాదవ్ వికెట్లను తీశాడు.. కాగా, అండర్సన్ 49 టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు. 2018లో ఇంగ్లాండులోని ఓవల్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు ఆటగాడు మహమ్మద్ షమీని అవుట్ చేయడం ద్వారా ఆస్ట్రేలియా ఆటగాడు మెక్ గ్రాత్ 563 టెస్ట్ వికెట్ల రికార్డును అండర్సన్ అధిగమించాడు. 2020లో సౌతాంప్టన్ వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో.. అజర్ అలీ ని అవుట్ చేయడం ద్వారా టెస్టుల్లో 600 వికెట్ల ఘనత సాధించాడు. అండర్సన్ సాధించిన 700 వికెట్ల ఘనతలో.. 434 వికెట్లు స్వదేశంలో సాధించాడు. విదేశాలలో 266 వికెట్లు పడగొట్టాడు..