India Vs England: సాధారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆట తీరు ప్రారంభిస్తాడు. టెస్ట్, వన్డే, టీ – 20 ఇలా ఏ ఫార్మాట్ తీసుకున్నా దూకుడే అతని ఆట తీరు. అందుకే అతడిని హిట్ మాన్ అని పిలుస్తుంటారు. మూడో టెస్టులో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలకమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ జట్టుపై పై చేయి సాధించేలా చేశాడు. ఏకంగా సెంచరీ కొట్టి తిరుగులేని ఇన్నింగ్స్ ఆడాడు. అటువంటి రోహిత్ శర్మ రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగవ టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్ లో నిరాశపరచాడు. శనివారం భారత తొలి ఇన్నింగ్స్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఇంగ్లాండ్ పేస్ బౌలర్ అండర్సన్ వేసిన అద్భుతమైన బంతికి బోల్తాపడ్డాడు.
భారత ఇన్నింగ్స్ మొదలైన మూడవ ఓవర్లో అండర్సన్ వేసిన నాలుగో బంతికి రోహిత్ బలయ్యాడు. అండర్సన్ గుడ్ లెంగ్త్ బంతిని సంధించాడు. ఆ బంతిని డిఫెన్స్ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు.. కానీ అది బ్యాట్ చివరి భాగాన తగిలి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. ఈ హఠాత్ పరిణామంతో రోహిత్ శర్మ నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
అంతకు ముందు ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో శనివారం రెండవ రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు మరో 51 పరుగులు చేసి ఆలౌట్ అయింది.. రాబిన్ సన్ 58 పరుగులతో రాణించారు. రూట్ 122 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. మొత్తానికి ఇంగ్లాండ్ జట్టు 353 పరుగులకు ఆల్ అవుట్ అయింది. మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత జట్టు కడపటి వార్తలు అందే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది.నాలుగు పరుగులకే రోహిత్ శర్మ వికెట్ కోల్పోయిన నేపథ్యంలో.. యశస్వి జైస్వాల్, గిల్ బాధ్యతాయుతంగా ఆడారు. రెండో వికెట్ కు 86 పరుగులు జోడించారు. 38 పరుగులు చేసిన గిల్ బషీర్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ప్రస్తుతం యశస్వి జైస్వాల్ 50(5 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో), రజిత్ పాటిదార్ 11 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత్ ఇంకా 248 పరుగులు వెనుకబడి ఉంది.
— Sitaraman (@Sitaraman112971) February 24, 2024