India Vs England: ఇంగ్లాండ్ జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా భారత్ 2 – 1 తో ముందంజలో ఉంది. ఈ సిరీస్ పై ఆశలు సజీవంగా ఉండాలంటే ఇంగ్లాండ్ జట్టుకు నాలుగో టెస్ట్ మ్యాచ్ గెలవడం ఆవశ్యం. మరోవైపు నాలుగు టెస్టు గెలిస్తే సిరీస్ భారత వశం అవుతుంది. అందుకే శుక్రవారం మొదలైన రాంచి టెస్ట్ పై అందరికీ ఆసక్తి నెలకొంది. రాజ్ కోట్ టెస్ట్ లో 434 పరుగుల తేడాతో భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత.. ఇంగ్లాండ్ జట్టు మార్క్ వుడ్, రెహాన్ ను పక్కనపెట్టి రాబిన్ సన్, షోయబ్ బషీర్ కు స్థానం కల్పించింది. ఇక భారత్ జట్టు కూడా బుమ్రా కు విశ్రాంతి ఇచ్చి అతని స్థానంలో ఆకాష్ దీప్ ను తీసుకుంది.
టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. క్రావ్ లీ, డక్కెట్ ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.. ఈ టెస్ట్ ద్వారా ఆరంగేట్ర మ్యాచ్ ఆడుతున్న ఆకాష్ రెండో ఓవర్ లో ఇన్ స్వింగర్ సంధించడంతో ఇంగ్లాండ్ బ్యాటర్ జాక్ క్రాలీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అది నోబాల్ కావడంతో బతికి పోయాడు..క్రావ్ లీ, డక్కెట్ భారత బౌలర్ల పై దూకుడుగా ఆడారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 47 పరుగులు జోడించారు. ఆకాష్ బౌలింగ్ లో డక్కెట్ కీపర్ ధృవ్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చిన పోప్ కూడా ఆకాష్ బౌలింగ్లో గోల్డెన్ డక్ గా ఔట్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 47 పరుగులు మాత్రమే. మరో ఆరు పరుగులకు ఇంగ్లాండ్ జట్టు క్రావ్ లే వికెట్ కోల్పోయింది. ఈ వికెట్లు మొత్తం ఆకాష్ పడగొట్టడం విశేషం.
జట్టు పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన రూట్, బెయిర్ స్టో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ అబేధ్యమైన నాలుగో వికెట్ కు 52 పరుగులు జోడించారు. వ్యక్తిగత స్కోర్ 38 పరుగుల వద్ద ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో అతడు వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన బెన్ స్టోక్స్ మూడు పరుగులకే జడేజా బౌలింగ్ లో ఔటయ్యాడు. ఈ క్రమంలో బెన్ ఫోక్స్ క్రీజ్ లోకి వచ్చాడు. రూట్, ఫోక్స్ కలిసి ఆరో వికెట్ కు 113 పరుగులు జోడించారు. ఒకవేళ వీరిద్దరూ ఈ స్థాయిలో కీలక భాగస్వామ్యం నెలకొల్పకుండా ఉండి ఉంటే ఇంగ్లాండ్ జట్టు 200 పరుగులకే చాప చుట్టేసేది. వీరిద్దరి భాగస్వామ్యం వల్ల పటిష్ట స్థితికి చేరుకుంది. ఈ క్రమంలోనే రూట్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఫోక్స్ కూడా47 పరుగుల వద్దకు చేరుకోగానే సిరాజ్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన టామ్ హార్ట్ లీ 13 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
హార్ట్ లీ అనంతరం బ్యాటింగ్ కు వచ్చిన రాబిన్ సన్ రూట్ కు అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే రూట్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 6 ఇన్నింగ్స్ ల్లో వరుసగా విఫలమైన తర్వాత అతడు కీలకమైన నాలుగో టెస్టులో సెంచరీ సాధించాడు. రాబిన్సన్, జో రూట్ జోడి స్కోరును 302 పరుగులకు చేర్చారు. అప్పటికి తొలి రోజు కోటా ఓవర్లు ముగియడంతో ఎంపైర్లు ఆట ముగిసినట్టు ప్రకటించారు. కాగా తొలి రోజు ఏడు వికెట్ల నష్టానికి ఇంగ్లాండ్ జట్టు 302 పరుగులు చేసింది. భారత బౌలర్లలో ఆరంగేట్ర బౌలర్ ఆకాష్ దీప్ మూడు వికెట్లు, సిరాజ్ రెండు వికెట్లు, జడేజా, అశ్విన్ చెరో వికెట్ పడగొట్టారు.