Magunta Sreenivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంటకు జగన్ లైన్ క్లియర్ చేశారు. దీంతో ఆయన స్వేచ్ఛ జీవి అయ్యారు. టిడిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒంగోలులో శుక్రవారం ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అధికారుల నుంచి ఆహ్వానం అందినా.. పార్టీ నుంచి మాత్రం ఎటువంటి పిలుపు లేకుండా పోయింది. దీంతో కార్యక్రమానికి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గైర్హాజరయ్యారు. ఇక పార్టీలో ఉండాలేనని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే మాగుంట సైతం జగన్కు అత్యంత నమ్మకమైన నేతల్లో ఒకరు. కానీ ఎందుకో ఆయన విషయంలో జగన్ శంకిస్తున్నారు. పార్టీలోనే కొనసాగుతానని మాగుంట చెప్పుకొస్తున్నా జగన్ వినకపోవడానికి కారణం ఏంటో తెలియదు.
ఇప్పటికే అత్యంత నమ్మకస్తుడైన వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీకి దూరమయ్యారు. ఆయన భార్య సైతం రాజీనామా చేశారు. నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, నెల్లూరు ఎంపీ స్థానం ఆఫర్ కు కూడా తిరస్కరించి మరి వేంరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. దీనిపై పార్టీ శ్రేణులు నాయకత్వం తీరుపై మండిపడుతున్నాయి. ఇప్పుడు మాగుంట విషయంలో సైతం అదే పరిస్థితి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి మాగుంట వైసీపీలోనే కొనసాగాలని భావించారు. ఆయన కోసం బాలినేని శ్రీనివాస్ రెడ్డి చివరి వరకు ప్రయత్నించారు. దీంతో హై కమాండ్ లెక్క చేయలేదు. ముందు మీ విషయం తెల్చుకోండి అంటూ బాలినేనిని డిఫెన్స్ లో పెట్టేదాకా పరిస్థితి వచ్చింది. అయితే జిల్లాలో ఎవరికీ లేని బాధ తనకి ఎందుకని.. బలమైన నేతను వదులుకునేందుకు హై కమాండ్ ఇష్టపడితే తానేం చేయగలనని బాలినేని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ నాయకత్వం చేజేతులా మాగుంట శ్రీనివాసుల రెడ్డి ని వదులుకోవడంతో ఆయన టిడిపిలో చేరేందుకు మార్గం సుగమం అయ్యింది.
అయితే ఎంతో నమ్మకస్తులైన నాయకులు వైసీపీ నుంచి అవమానకరంగా బయటకు వెళ్తున్నారు. వైసిపికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన నేతల్లో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు. కానీ అనిల్ కుమార్ యాదవ్ కోసం ఆయన వదులుకోవడం నెల్లూరు వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆర్థిక స్థితిమంతుడు, ఆపై పట్టున్న నాయకుడు కావడంతో ఆయనతో ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పుడు మాగుంట విషయంలో కూడా అదే పరిస్థితి ఉంది. మీకు టిక్కెట్ లేదని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. కానీ ఇలా అవమానిస్తే సదరు నేత కసిగా పనిచేస్తారు. అది మొదటికే మోసం వస్తుంది. కానీ ఎందుకో వైసీపీ నాయకత్వం అవమానించి చాలామంది నేతలను బయటకు పంపడాన్ని శ్రేణులు తప్పుపడుతున్నాయి. దీంతో మూల్యం తప్పదని భయపడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.