India Vs Bangladesh: భారత్ – బంగ్లా ప్రాక్టీస్ మ్యాచ్లో కలకలం.. రోహిత్ మీదకు వచ్చిన అభిమాని.. వీడియో వైరల్

తమ కళ్ళుగప్పి అభిమాని మైదానం లోపలికి రావడంతో అమెరికా పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని నేలపై పడుకోబెట్టి చితక్కొట్టారు. అప్పటికి రోహిత్ శర్మ వద్దని చెప్పినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 10:17 am

India Vs Bangladesh

Follow us on

India Vs Bangladesh: టి20 ప్రపంచ కప్ 2024 లో భాగంగా అమెరికా వేదికగా భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో కలకలం నెలకొంది. ఈ మ్యాచ్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని అమెరికా అధికారులు చెప్పినప్పటికీ.. అది చేతల్లో కాదని ఓ అభిమాని నిరూపించాడు. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ వైపు ఓ అభిమాని దూసుకొచ్చాడు.. అతని ఆలింగనం చేసుకొని తన అభిమానాన్ని ప్రదర్శించాడు.

తమ కళ్ళుగప్పి అభిమాని మైదానం లోపలికి రావడంతో అమెరికా పోలీసులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ వ్యక్తిని నేలపై పడుకోబెట్టి చితక్కొట్టారు. అప్పటికి రోహిత్ శర్మ వద్దని చెప్పినప్పటికీ.. పోలీసులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో మ్యాచ్ నిర్వాహకులు వాయువేగంతో మైదానంలోకి వచ్చి.. రోహిత్ విజ్ఞప్తిని పోలీసులకు తెలియజేశారు. దీంతో ఆ అభిమానిని పైకి లేపి పోలీసులు బయటికి తీసుకొచ్చారు.

ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చర్చకు దారి తీస్తోంది. పోలీసులు అభిమానిని కొడుతుంటే రోహిత్ స్పందించిన తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు . రోహిత్ కు అభిమానులు అంటే ఇష్టమని.. అందుకే వారికి కష్టకాలంలో అండగా ఉంటాడని కామెంట్స్ చేస్తున్నారు.

ఈ ప్రాక్టీస్ మ్యాచ్లో ముందుగా భారత జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 182 రన్స్ చేసింది. రిషబ్ పంత్ 53, హార్దిక్ పాండ్యా 40*, సూర్య కుమార్ యాదవ్ 31 రన్స్ చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఇస్లాం, మహమ్మదుల్లా, తన్వీర్ ఇస్లాం తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య చేదనకు దిగిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 122 పరుగులు మాత్రమే చేసి.. 60 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బంగ్లా బ్యాటర్లలో మహమ్మదుల్లా 40(రిటైర్డ్ హర్ట్), షకీబ్ ఉల్ హసన్ 28 పరుగులతో టాప్ స్కోరర్లు గా నిలిచారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, శివం దుబే చెరో రెండు వికెట్లు పడగొట్టారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, బుమ్రా తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.