AP Elections 2024: దేశవ్యాప్తంగా బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి హవా నడుస్తోందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఈసారి ఉత్తరాది తో పాటు దక్షిణాదిలో కూడా బిజెపికి మంచి ఫలితాలు రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటకలో ఆ పార్టీకి సొంత బలం ఉంది. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి లేదు. స్వతహాగా ఒక్క సీటు కూడా గెలుచుకునే ఛాన్స్ కనిపించలేదు. అందుకే బిజెపి అగ్రనేతలు వ్యూహాత్మకంగా పొత్తుకు అంగీకరించారు. టిడిపి, జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. అయితే ఇందులో కూడా ఒక వ్యూహం దాగి ఉంది. గత ఐదు సంవత్సరాలుగా స్నేహం అందిపుచ్చుకున్న వైసీపీని కాదని.. టిడిపి తో జతకట్టడం అంత ఆషామాషి కాదు. చాలా ముందు చూపుతో వ్యవహరించి బిజెపి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి ఏపీలో తమకు నమ్మదగిన మిత్రుడు ఎవరు అని.. బిజెపి గట్టిగానే మధనం చేసింది. వద్దన్నా గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ నేతలు కాళ్లు పట్టేసుకున్నారు. అడగకపోయినా మా మద్దతు మీకేం అంటూ ఎగబడ్డారు. కానీ ఏపీ విషయం తెలుసుకున్న బిజెపి అగ్రనేతలు కనీసం తాము వైసీపీని ఎప్పుడూ మిత్రులుగా చూడలేదని తేల్చేశారు. టిడిపి జనసేనతో జత కట్టారు. ఆ ప్రయత్నాలను ఆపడానికి వైసిపి చేయని ప్రయత్నం అంటూ లేదు. తామే గెలుస్తున్నామని.. సంపూర్ణ మద్దతు ఇస్తామని బిజెపి అగ్రనేతలకు రాయబారం పంపినా ప్రయోజనం లేకుండా పోయింది.
గత ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో వైసిపి గెలిచింది. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేసి ఈసారి గెలుపొందుతామని శపథం చేసింది. గెలిచే పార్టీగా తాము ఉన్నామని.. తమను వదిలి టిడిపి తో జత కట్టడం ఏమిటని ప్రశ్నించింది. కానీ వాస్తవాలు బిజెపికి తెలుసు. అందుకే ప్రధాని విస్పష్ట ప్రకటన చేశారు. తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ తీరును ఎండగట్టారు. గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రజలను వంచిందని.. ఆ పార్టీ మళ్లీ గెలిచే అవకాశం లేదని మోడీ తేల్చి చెప్పారు. ఉచితాల మాటున రాష్ట్రాన్ని నష్టపరిచిన విషయాన్ని సైతం ప్రస్తావించారు. అభివృద్ధి లేకపోగా ఉద్యోగ, ఉపాధి కల్పనలో సైతం పెద్దగా పురోగతి లేకపోవడాన్ని ప్రధాని గుర్తు చేశారు.
అయితే బిజెపి అగ్రనేతల వ్యూహం పక్కాగా పనిచేసింది. దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి మంచి ఫలితాలు సాధిస్తుందని.. దానికి మోదీ, షా ద్వయం వ్యూహాలు కారణమని ఏబిపి సి ఓటర్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. గత ఎన్నికల్లో ఏపీలో అసలు బిజెపి బోణీ కొట్టలేదు. కానీ ఈ ఎన్నికల్లో మాత్రం పోటీ చేసిన ఆరు స్థానాల్లో విజయం సాధించినా ఆశ్చర్య పడనవసరం లేదని అంచనా వేయడం విశేషం. మొత్తానికైతే పరిస్థితులకు తగ్గట్టుగానే బిజెపి అగ్ర నేతలు తీసుకున్న నిర్ణయాలు.. మంచి ఫలితం ఇస్తున్నాయి.