https://oktelugu.com/

India Vs Australia WTC Final: ఈ ఆస్ట్రేలియన్స్ తో అంత ఈజీ కాదట.. భారత్ కు టఫ్ ఫైట్ ఖాయం

కామెరూన్ గ్రీన్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న క్రికెటర్ల పేర్లలో ఇది ఒకటి. ఈ ఆస్ట్రేలియా సంచలన పేస్ ఆల్ రౌండర్.. బ్యాట్, బంతితో ఉత్తమ ప్రదర్శన చేస్తూ తక్కువ కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు.

Written By:
  • BS
  • , Updated On : June 5, 2023 / 01:33 PM IST

    India Vs Australia WTC Final

    Follow us on

    India Vs Australia WTC Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన తర్వాత యావత్ క్రికెట్ అభిమానుల దృష్టి మొత్తం ఈ నెల 7 నుంచి జరగనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మీదే ఉంది. ఈ ఆసక్తికరమైన ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రెండు రోజుల్లో ఈ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఫైనల్ మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే సిద్ధమైంది. బ్యాటింగ్ బౌలింగ్, విభాగాల్లో భారత జట్టు బలంగానే కనిపిస్తోంది. మరి ఆస్ట్రేలియా జట్టు సంగతి ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ఆటగాళ్లతో ఆస్ట్రేలియా జట్టు ఈ సమరానికి సై అంటోంది.

    డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఈ నెల 7 నుంచి 11 తేదీల మధ్య లండన్ లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో భారత్ – ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతుండడంతో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమవుతున్నాయి. ఇరు జట్లు బలాబలాలు పరంగా చూస్తే సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నాయి. కానీ, ఈ ఐదు రోజుల మ్యాచ్ లో ఒక్కరోజు ప్రదర్శన అధ్వానంగా ఉన్నా ఓటమి తప్పదు. భారత జట్టుకు ఏమాత్రం తీసుపోని విధంగా అత్యుత్తమ ఆటగాళ్లతో బరిలోకి దిగుతోంది ఆస్ట్రేలియా జట్టు. బ్యాటింగ్ లో లోతుతో, బౌలింగ్లో పదునుతో రోహిత్ సేనను దెబ్బ కొట్టాలని చూస్తోంది. పరిస్థితులు ఆ జట్టుకే అనుకూలంగా కనిపిస్తున్నాయి. భారత జట్టుకు ఎదురు నిలిచే కంగారుల బృందం ఎలా ఉందో ఒకసారి మనమూ చూసేద్దాం.

    అత్యుత్తమ బ్యాటింగ్ విభాగంతో బలంగా ఆస్ట్రేలియా జట్టు..

    వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ప్రత్యర్థి ఆస్ట్రేలియాను చూస్తుంటే టీమ్ ఇండియాకు కట్టిన పరీక్ష తప్పదనిపిస్తోంది. కెప్టెన్ కమిన్స్ తోపాటు ఖవాజా, వార్నర్, లబుషెన్, స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ క్యారీ, స్టార్క్, లైయన్, బోలాండ్.. ఇలా జట్టు ప్రమాదకరంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి పరిస్థితిలు ఉండే ఓవల్ లో పేస్ ధాటితో భారత్ ను హడాలెత్తించేందుకు కంగారు జట్టు సిద్ధమవుతోంది. 2021లోనూ ఇలాగే ఇంగ్లాండు గడ్డపై మొట్టమొదటి డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ పేస్ ధాటికి భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. మరి, ఈసారి ఆసీస్ పేస్ దళాన్ని ఎలా ఎదుర్కొంటారు అన్నది చూడాల్సి ఉంది. డబ్ల్యూటిసి చక్రం (2021-23)లో ఆసీస్ ప్రదర్శన మామూలుగా లేదు. 19 మ్యాచుల్లో 11 విజయాలు, ఐదు డ్రాలతో పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంతో ఫైనల్ కు అర్హత సాధించింది ఈ జట్టు. ఈ ఛాంపియన్ షిప్ లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసిన టాప్ ఏడుగురు ఆటగాళ్లలో నలుగురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉన్నారు. అత్యధిక వికెట్లు పడగొట్టింది కూడా ఆస్ట్రేలియా బౌలర్ కావడం విశేషం.

    అత్యంత బలంగా.. లోతుగా కనిపిస్తున్న బ్యాటింగ్ విభాగం..

    ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లోతుగా, బలంగా ఉంది. ప్రధానంగా ఖవాజా, లాబుషేన్, స్మిత్, హెడ్ మూల స్తంభాలుగా మారారు. ముఖ్యంగా ఖవాజా తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఈ డబ్ల్యుటిసి చక్రంలో ఈ ఓపెనర్ ఇప్పటి వరకు 16 మ్యాచుల్లో 69.91 సగటుతో 1608 పరుగులు సాధించాడు. అత్యధిక పరుగుల వీరుల్లో రూట్ (1915) తర్వాత ఖవాజాదే రెండో స్థానం. చివరగా భారత్ లో ఆడిన బోర్డర్ – గవాస్కర్ సిరీస్ లో అత్యధిక పరుగులు 303 చేసింది కూడా ఇతనే. ఇక క్రీజులో కుదురుకుంటే చాలు అలవోకగా శతకాలు బాదేసే లబుషేన్ కూడా జోరు మీద ఉన్నాడు. ఈ డబ్ల్యూటిసిలో అతను 19 మ్యాచుల్లో 1509 పరుగులు చేశాడు. పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం, బౌలర్ల లయను దెబ్బతీసి పరుగులు సాధించే నైపుణ్యాలతో లబుషేన్ సాగుతున్నాడు. భారత్ కు కొరకరాని కొయ్య స్మిత్ తో ఎప్పుడూ ప్రమాదమే. ఈ డబ్ల్యూటిసి చక్రంలో 19 మ్యాచుల్లో 1252 పరుగులు చేసిన అతను టీమ్ ఇండియాతో మ్యాచ్ అంటే చాలు ఏ స్థాయిలో చెలరేగుతాడో తెలిసిందే. భారత్ పై 18 టెస్టుల్లో 65.06 సగటుతో 1887 పరుగులు చేశాడు. ఈ సగటు అతను కెరీర్ సగటు 59.80 కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఇంగ్లాండ్ లోనూ అతని రికార్డు 16 టెస్టుల్లో 1727 గొప్పగా ఉంది. ఇక ఓవల్ అతనికి కలిసి వచ్చిన వేదిక అని చెప్పవచ్చు. ఇక్కడ మూడు టెస్టుల్లో ఏకంగా 97.75 సగటుతో 391 పరుగులు సాధించాడు. స్మిత్ ను క్రీజులో కుదురుకోనిస్తే భారత్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. పైగా స్మిత్, లబుషేన్ కౌంటిల్లో ఆడుతూ ఈ ఫైనల్ కోసం బాగానే సన్నద్ధమయ్యారు. మిడిల్ ఆర్డర్లో హెడ్ కీలకంగా మారాడు. ఈ డబ్లూటిసిలో 17 మ్యాచుల్లో 1209 పరుగులు చేసిన అతను జట్టు భారీ స్కోర్ చేయడంలో, చేధనలో లక్ష్యాన్ని అందుకోవడంలో సాయపడుతున్నాడు.

    అందరి కళ్ళు ఆటగాడిపైనే ఉన్నాయి..

    కామెరూన్ గ్రీన్.. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువగా వినిపిస్తున్న క్రికెటర్ల పేర్లలో ఇది ఒకటి. ఈ ఆస్ట్రేలియా సంచలన పేస్ ఆల్ రౌండర్.. బ్యాట్, బంతితో ఉత్తమ ప్రదర్శన చేస్తూ తక్కువ కాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఇప్పటి వరకు 20 టెస్టులు ఆడిన ఈ పొడగరి 941 పరుగులు చేయడంతోపాటు 23 వికెట్లు తీశాడు. ఈ ఏడాది ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన గ్రీన్.. ఓ శతకం సహా 452 పరుగులతో సత్తా చాటాడు. ఫార్మాట్ కు తగ్గట్టుగా బ్యాటింగ్ లో పరుగులు రాబడుతూ మంచి వేగంతో బౌలింగ్ చేస్తూ గ్రీన్ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పుడు డబ్ల్యూటీసి ఫైనల్ లో అతనిపై ఆస్ట్రేలియా భారీ ఆశలే పెట్టుకుంది. అతని కారణంగా జట్టుకు సమతూకం కూడా వచ్చింది. అదనంగా ఓ బ్యాటర్ లేదా బౌలర్ ను ఆడించే వెసులుబాటు ఆస్ట్రేలియా జట్టుకు కలగనుంది. ఇక కొంతకాలం నుంచి అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడలేమితో సతమతమవుతున్న వార్నర్ కూడా ఐపీఎల్ తో లయ అందుకున్నట్లే కనిపించాడు. అతను క్రీజీలో నిలబడితే ప్రత్యర్థికి ఎంతటి నష్టం చేయగలడో తెలిసిందే. వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కూడా అవసరమైనప్పుడు జట్టుకు ఉపయోగపడుతున్నాడు.

    ఆ కీలక బౌలర్ లేకపోయినా బలంగానే..

    ఆస్ట్రేలియా – ఇండియా మధ్య డబ్ల్యుటిసి ఫైనల్ అనే చర్చ రాగానే మొదట కంగారుల బౌలింగ్ బలం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. గాయం నుంచి కోలుకోని హేజిల్ వుడ్ దూరమవడం ఆ జట్టుకు దెబ్బే. కానీ, ఆ లోటు తెలియకుండా చేసే బౌలింగ్ ప్రత్యామ్నాయాలు ఆసీస్ కు ఉన్నాయి. కమిన్స్, స్టార్క్.. ఇంగ్లాండ్ పిచ్ లపై ఈ పేస్ ధ్వయం ఎలాంటి ప్రత్యర్థికైనా వణుకు పుట్టించేది. ఈ డబ్ల్యూటిసి చక్రంలో కమిన్స్ 15 మ్యాచ్ ల్లో 53 వికెట్లు తీయగా, స్టార్క్ 16 మ్యాచ్ ల్లో 51 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా ఇంగ్లీష్ గడ్డపై స్వింగ్ అనుకూల పరిస్థితుల్లో సారధి కమిన్స్ మరింత ప్రభావంతంగా రాణించగలడు. కాస్త విరామం తర్వాత తాజాగా వస్తున్న అతను జట్టును నడిపించడంతోపాటు తన బౌలింగ్ తో భారత బ్యాటర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాడు. టీమ్ ఇండియాపై 12 టెస్టుల్లో 46 వికెట్లు సాధించాడు. ఇక ఇంగ్లాండ్ తో అయితే ఐదు మ్యాచ్ ల్లో 19.62 సగటుతో 20 వికెట్లు పడగొట్టడం విశేషం. మరోవైపు స్టార్క్ ఎప్పటికీ ప్రమాదకర బౌలరే. అంతర్జాతీయ క్రికెట్ పై దృష్టి పెట్టడం కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగ్ లకు దూరంగా ఉంటున్న అతను వికెట్ల ఆకలితో ఉన్నాడు. వేగమే అతని ఆయుధం. మంచి పేస్ తో బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ బ్యాటర్లను బోల్తా కొట్టిస్తాడు. పాత బంతితోను సమర్థంగా రివర్స్ స్వింగ్ రాబడతాడు. హజల్ వుడ్ స్థానంలో వచ్చిన నెసర్ కూడా నైపుణ్యమున్న పేసర్. ఇక స్పిన్ విషయానికొస్తే ఆసీస్ ఒక్క స్పిన్నర్ ని ఆడించే అవకాశం ఉంది. ఆ ఒక్కరే లైయన్. డబ్లూటిసిలో అత్యధిక వికెట్లు 83 సాధించింది కూడా అతడే. ఫైనల్ చివరి రెండు రోజులు ఆటలో అతను కీలకము కానున్నాడు. పిచ్ అనుకూలిస్తే ఈ ఆప్ స్పిన్నర్ ఎలా విజృంభిస్తాడో తెలిసిందే. ఇంగ్లాండులో అతనికి 13 మ్యాచుల్లో 45 వికెట్లు సాధించిన మంచి రికార్డు ఏ ఉంది. అన్ని విభాగాల్లో పటిష్టమైన ఆటగాళ్లతో బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియా జట్టును భారత్ ఏ విధంగా డిఫరెంట్ చేయనుందో అన్న ఆసక్తి ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో నెలకొంది.