Medical Student: ప్రీతి ఘటన మరువక ముందే.. మెడికో మానస దుర్మరణం: వెలుగులోకి సంచలన విషయాలు

ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఖమ్మం పోలీసులు మానస ఆత్మహత్య సమాచారం రావడంతోనే వెంటనే అప్రమత్తమయ్యారు. పైగా ఇది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన మెడికల్ కాలేజీ కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా కేసు విచారణ చేశారు. అయితే మానస చదువులో మహా చురుకు.

Written By: Bhaskar, Updated On : June 5, 2023 1:44 pm
Follow us on

Medical Student: ప్రీతి.. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్య అభ్యసిస్తున్న ఈ యువతి ఆత్మహత్య అప్పట్లో రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. తన సీనియర్ సైఫ్ వేధింపుల వల్ల తాను ఇబ్బంది పడుతున్నానని తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్లు పోలీసులను సంప్రదించారు. ఇది జరిగిన తర్వాత ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. నిమ్స్ లో చికిత్స పొందుతూ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ ఘటన మర్చిపోకముందే ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీలో ఆదివారం ఓ వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసుల విచారణలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

ఆత్మ న్యూనత

మన సమాజంలో వైద్యులు అత్యంత ఆత్మస్థైర్యం ఉన్నవాళ్లు అనుకుంటాం. కానీ వారు కూడా సాధరణ మనుషుల్లాగానే భావోద్వేగాలకు గురవుతుంటారని మెడికో మానస మృతితో తేటతెల్లమైంది. వరంగల్ జిల్లా పోచమ్మ మైదానం ప్రాంతానికి చెందిన సముద్రాల మానస (22) ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో డెంటల్ నాలుగో ఏడాది చదువుతోంది. కళాశాలకు సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నది. హాస్టల్ పై అంతస్తులో తనుకుంటున్న గదిలోకి వెళ్లిన మానస.. పెట్రోల్ ఒంటి మీద పోసుకొని నిప్పు అంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె గదిలో నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన సీనియర్ విద్యార్థిని కేకలు వేయడంతో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగలగొట్టి మంటలను ఆర్పారు. కానీ మానస అప్పటికే మృతి చెందింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి మానస మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

పోలీసుల విచారణ

ప్రీతి ఆత్మహత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. ఖమ్మం పోలీసులు మానస ఆత్మహత్య సమాచారం రావడంతోనే వెంటనే అప్రమత్తమయ్యారు. పైగా ఇది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన మెడికల్ కాలేజీ కావడంతో పోలీసులు చాలా జాగ్రత్తగా కేసు విచారణ చేశారు. అయితే మానస చదువులో మహా చురుకు. ఈ కాలేజీలో డెంటల్ విద్య అభ్యసిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె తల్లి అనారోగ్యంతో కన్ను మూసింది. అప్పటినుంచి మానస ఆత్మ న్యూనతకు గురైంది. ఈలోగా ఆమె తండ్రి మరో వివాహం చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి కుటుంబంలో వివాదాలు ప్రారంభమయ్యాయి. తండ్రి కూడా సరిగ్గా పట్టించుకోకపోవడంతో మానస మానసికంగా మరింత కుంగిపోయింది. ఇక తండ్రి కూడా అనారోగ్యం బారిన పడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కూడా కన్నుమూశాడు. దీంతో మానస మానసికంగా మరింత డీలా పడిపోయింది. కుంగుబాటుకు గురయ్యి.. దానిని అధిగమించేందుకు స్నేహితురాళ్ళ వద్దకు వెళ్లేది. మరోవైపు తల్లిదండ్రి మృతి చెందినప్పటికీ.. ఇంట్లో వివాదాలు వెలుగు చూస్తుండడంతో వాటిని తట్టుకోలేక ఆదివారం ఒంటిపై పెట్రోల్ పోసుకొని, నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. కాగా మానస మృతితో మమత వైద్య కళాశాలకు సెలవు ప్రకటించారు. డెంటల్ విద్యార్థులు శోకసంద్రంలో మునిగిపోయారు. మానస మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. పోలీస్ అధికారులు వరంగల్ లోని ఆమె స్వస్థలానికి తరలించారు. సోమవారం వరంగల్ లోని స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు వివరించారు.