Ind Vs Aus 5th Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారీ విజయం సాధించింది. 295 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. ఆ టెస్టులో టీమిండియా కు బుమ్రా నాయకత్వం వహించాడు. ఆ తర్వాత అడిలైడ్, మెల్ బోర్న్ టెస్టులలో టీమిండియా ఓడిపోయింది. బ్రిస్ బేన్ టెస్టు డ్రా అయింది. ఒకవేళ వర్షం కురువకపోతే ఇక్కడ కూడా అడిలైడ్ ఫలితమే వచ్చేది. ఈ మూడు టెస్టులకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాల్సిన తరుణంలో టీమిండియా ఇలా వరుసగా ఓటములు ఎదుర్కోవడం.. అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ ను వైట్ వాష్ రూపంలో కోల్పోవడంతో రోహిత్ శర్మ పై విమర్శలు పెరిగిపోయాయి. అతడు రిటైర్మెంట్ ప్రకటించాలని సోషల్ మీడియా వేదికగా ఉద్యమమే నడిచింది. ఇక రోహిత్ శర్మ పై జట్టు మేనేజ్మెంట్ కు కూడా నమ్మకం తగ్గిపోయింది. దీంతో అతడికి ఐదో టెస్టు నుంచి విశ్రాంతి ఇవ్వాలని భావించింది. కోచ్ గౌతమ్ గంభీర్ కూడా రోహిత్ శర్మ ఆడించడంలో సుముఖత ప్రదర్శించలేదు. సిడ్నీ మైదానాన్ని చూసిన తర్వాతే తుది జట్టును ప్రకటిస్తామని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించాడు. గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలను లోతుగా అర్థం చేసుకున్న జాతీయ మీడియా.. రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వరని.. అతడికి విశ్రాంతి ఇస్తారని తన కథనాలలో పేర్కొంది. జాతీయ మీడియా చెప్పినట్టుగానే.. రోహిత్ కు జట్టు మేనేజ్మెంట్ ఉద్వాసన పలికింది.
లంచ్ కు ముందే మూడు డౌన్
సిడ్ని టెస్టులో బుమ్రా కు కెప్టెన్సీ ఇచ్చినప్పటికీ భారత జట్టు కథ మారలేదు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ త్వరగానే అవుట్ అయ్యారు. మెల్ బోర్న్ టెస్టులో 82, 84 పరుగులు చేసిన యశస్వి.. సిడ్ని టెస్టులో మాత్రం విఫలమయ్యాడు. పది పరుగులు మాత్రమే చేసిన అతడు బోలాండ్ బౌలింగ్లో వెబ్ స్టర్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి స్టార్క్ బౌలింగ్లో కోన్ స్టాస్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరుకున్నాడు. ఈ దశలో గిల్, విరాట్ కోహ్లీ మూడో వికెట్ కు 46 పరుగులు జోడించారు. వ్యక్తిగత స్కోర్ 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ లయన్ బౌలింగ్లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 57 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి టీం ఇండియా కష్టాల్లో పడింది. ప్రస్తుతం లంచ్ సెషన్ సాగుతోంది.. విరాట్ కోహ్లీ(12*), రిషబ్ పంత్ (0) క్రీజ్ లో ఉన్నారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా గత రెండు సీజన్లలో ఈ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ తలపడగా..రెండు మ్యాచ్ లు కూడా డ్రా అయ్యాయి. ఈసారి టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లాలంటే సిడ్నీ మ్యాచ్లో టీమిండియా కచ్చితంగా గెలవాలి.