Ind Vs Aus 3rd Test: బ్రిస్బేన్ లోని గబ్బా మైదానంలో శనివారం మూడవ టెస్ట్ మొదలైంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచాడు.. అనంతరం బౌలింగ్ వైపు ఆసక్తి చూపించాడు. తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన కెప్టెన్ బుమ్రా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్లో టీమ్ ఇండియా 295 రన్స్ తేడాతో గెలిచింది. అడిలైడ్ వేదికగా జరిగిన రెండో టెస్టులో టాస్ నెగిన రోహిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇక మూడవ టెస్టులోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ టాస్ గెలిచాడు. అయితే ఈసారి విభిన్నంగా బౌలింగ్ వైపు మొగ్గు చూపించాడు. మైదానంలో ఉన్న పరిస్థితులు..గ్రాస్ ఉన్న నేపథ్యంలో బౌలింగ్ ఎంచుకున్నామని రోహిత్ చెప్పుకొచ్చాడు. టాస్ గెలిచిన అనంతరం రోహిత్ విలేకరులతో మాట్లాడాడు.” టాస్ గెలిచాం. బౌలింగ్ వైపు ఆసక్తి చూపించాం. ఇక్కడ ఓవర్ కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. మైదానంపై పచ్చి గడ్డి కూడా ఉంది. వీటిని మేము సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నాం. ఇక్కడ కొద్దిరోజులుగా విపరీతమైన క్రికెట్ ఆడుతున్నాం. ఈ మ్యాచ్ మాకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నాం. ఈ సిరీస్ లో ఇప్పటివరకు రెండు జట్లు మెరుగ్గా ఆడాయి. మాపై భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా చేరుకుంటాం. మెరుగైన క్రికెట్ ఆడతాం. అవకాశాలను అందిపుచ్చుకుంటాం. గత మ్యాచ్ లో సత్తా చూపించలేకపోయాం. అందువల్లే ఓడిపోయాం. ఈ మ్యాచ్లో సత్తా చూపించడానికి కుర్రాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మ్యాచ్ నడుస్తున్నా కొద్దీ వికెట్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతున్నది.. టాస్ గెలవడాని కంటే ముందే జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. అశ్విన్, హర్షిత్ రాణా కు ప్రశాంతి ఇచ్చాం. వారి స్థానంలో రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్ కు జట్టులో స్థానం కల్పించాం. టీం కూర్పులో భాగంగానే ఈ మార్పులు జరిగాయని” రోహిత్ పేర్కొన్నాడు.
మేం కూడా బౌలింగ్..
టాస్ గెలిస్తే మేం కూడా బౌలింగ్ ఎంచుకునే వాళ్ళమని ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ వ్యాఖ్యానించాడు..” మేం కూడా బౌలింగ్ వైపు ఆసక్తి చూపించేవాళ్ళం. ఇప్పటివరకు సిరీస్ హోరాహోరీగా సాగింది. గత వారం మేము మెరుగైన క్రికెట్ ఆడాం. ఆటగాళ్లు ఉత్సాహకరమైన అనుభవంలోకి వచ్చారు. ఈ మ్యాచ్ కోసం మేము పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాం. అడిలైడ్ టెస్టును ముందుగానే ముగించడం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడికి వచ్చి పూర్తిస్థాయిలో సిద్ధం కావడానికి అవకాశం లభించింది. బోలాండ్ స్థానంలో జోష్ హాజిల్ వుడ్ కు అవకాశం ఇచ్చామని” కమిన్స్ వివరించాడు.
ఆస్ట్రేలియా ఎంత స్కోర్ చేసిందంటే..
టాస్ గెలిచిన టీం ఇండియా కెప్టెన్ రోహిత్ బౌలింగ్ వైపు మొగ్గు చూపించడంతో.. ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ కు దిగింది. కడపటి వార్తలు అందే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా(19), మెక్ స్వీనే(4) క్రీజ్ లో ఉన్నారు. మైదానంపై పచ్చిక అధికంగా ఉండడంతో కెప్టెన్ రోహిత్ శర్మ పేస్ బౌలర్లైన బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్ తో బౌలింగ్ వేయిస్తున్నాడు. ఆస్ట్రేలియా ఓపెనర్లు నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నారు. భారత బౌలింగ్ ను ఎదుర్కొంటూ వికెట్ ను కాపాడుకుంటున్నారు. పచ్చిక అధికంగా ఉండడంతో బంతులు వేగంగా దూసుకు వస్తున్నాయి. స్వింగ్ అవుతూ బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నాయి. కాగా, ఈ వేదిక వద్ద వర్షం కురుస్తూనే ఉంది. విస్తారంగా కురుస్తున్న వర్షం వల్ల మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రోహిత్ పాచిక పారడం కష్టంగా మారింది.