India vs Australia : ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ లో భాగంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాపై అన్ని రంగాలలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బౌలింగ్లో ఆకట్టుకుంది.. బ్యాటింగ్ లో బెంబేలెత్తించింది. మొత్తానికి 2023 నాటి వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకుంది. విరాట్ వీర విహారం.. కేఎల్ రాహుల్ పవర్ ఫుల్ బ్యాటింగ్.. చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత్ ఆస్ట్రేలియా పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
దుబాయ్ మైదానంపై టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మైదానంపై బలమైన పట్టును కలిగి ఉన్న భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాపై కూడా అదే స్థాయిలో బౌలింగ్ చేశారు. ఫలితంగా ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌట్ అయింది.. ఆస్ట్రేలియా ప్లేయర్లలో స్మిత్ 73 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్యారీ 61 పరుగులు చేశాడు. హెడ్ 39 రన్స్ సాధించాడు. ఇక మహమ్మద్ షమ్మీ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా చెరి రెండు వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
Also Read : ఈసారి లెక్క తప్పలేదు.. 2023 నాటి ఓటమికి బదులు తీర్చుకున్నట్టే..
ఆస్ట్రేలియా విధించిన 265 రన్స్ టార్గెట్ తో రంగంలోకి దిగిన టీమిండియా కు ఓపెనర్లు గొప్ప ఆరంభాన్ని అందించలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వేగంగా ఆడే క్రమంలో అతడు కన్నోల్లి బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు.. గిల్ 8 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ (84), శ్రేయస్ అయ్యర్ (45) సమయోచితంగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 91 పరుగులు జోడించారు. శ్రేయస్ అయ్యర్ ఔట్ అయిన తర్వాత.. అక్షర్ పటేల్ (27) మైదానంలోకి వచ్చాడు. అతడు దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఈ దశలో వచ్చిన కేఎల్ రాహుల్ (42*) మొదట్లో నిదానంగా.. తర్వాత దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. విరాట్ కోహ్లీతో కలిసి మెరుగైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇదే దశలో 84 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్యా దూకుడుగా ఆడాడు. ఏకంగా 28 పరుగులు చేసి టీమ్ ఇండియా పై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించాడు. ఇక అదే వేగంలో ఆడి హార్దిక్ ఔటయ్యాడు. చివర్లో వచ్చిన రవీంద్ర జడేజా రెండు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. మాక్స్ వెల్ బౌలింగ్లో రాహుల్ విన్నింగ్ షాట్ గా సిక్సర్ కొట్టి.. మ్యాచును ముగించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో ఎల్లిస్, జంపా చెరి రెండు వికెట్లు సాధించారు. ఇక గ్రూప్ బి లో రెండవ సెమీఫైనల్ మ్యాచ్ బుధవారం పాకిస్తాన్ వేదికగా జరగనుంది. న్యూజిలాండ్ – దక్షిణాఫ్రికా ఇందులో తలపడతాయి. ఇందులో గెలిచిన జట్టు భారత్ తో ఆదివారం ఫైనల్ మ్యాచ్ ఆడుతుంది.
Also Read : శ్రేయస్ అయ్యర్ త్రో కు వికెట్లు నేలకొరిగాయి.. బిత్తర పోయిన అలెక్స్ క్యారీ.. వైరల్ వీడియో