India vs Australia highlights: అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. ఓపెనర్ గిల్ (9) నిరాశపరిచినప్పటికీ, విరాట్ కోహ్లీ (0) మరోసారి సున్నా కే పరిమితమైనప్పటికీ.. రోహిత్ శర్మ (73), శ్రేయస్ అయ్యర్ (61) అదరగొట్టారు. వీరిద్దరు చేసిన హాఫ్ సెంచరీలు టీమ్ ఇండియాకు బలమైన బూస్టప్ ఇచ్చాయి. వీరిద్దరూ మూడో వికెట్ కు ఏకంగా 118 పరుగులు జోడించారు. తద్వారా టీమిండియా పటిష్ట స్థితిలోకి వెళ్లిపోయింది. ఈ దశలో రోహిత్, అయ్యర్ అవుట్ కావడంతో టీమ్ ఇండియా పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారింది. ఈ దశలో వచ్చిన అక్షర్ పటేల్ (44) అదరగొట్టాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న కేఎల్ రాహుల్ (11), వాషింగ్టన్ సుందర్ (12), నితీష్ కుమార్ రెడ్డి (8) దారుణంగా విఫలమయ్యారు. వీరు ముగ్గురు సరిగా ఆడ లేకపోవడంతో టీమిండియా స్కోర్ 300 మార్కుకు చేరుకోలేకపోయింది. టీమిండియా కు అత్యంత అవసరమైన సందర్భంలో అక్షర్ పటేల్ అవుట్ కావడంతో టీమిండియా తడబడింది.
అక్షర్ ఔట్ అయిన తర్వాత.. బాధ్యతాయుతమైన స్థితిలో ఇన్నింగ్స్ నిలబెట్టాల్సిన నితీష్ కుమార్ రెడ్డి అత్యుత్సాహానికి వెళ్లి ఔట్ అయ్యాడు. దీంతో టీమ్ ఇండియా లో ఒకసారిగా ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడింది. దీంతో కనీసం 250 పరుగులైనా చేస్తుందా? అనే అనుమానం మొదలైంది. ఈ దశలో వచ్చిన గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా(24*) 18 బంతుల్లో మూడు బౌండరీల సహాయంతో 24 పరుగులు చేశాడు.. మరో బౌలర్ అర్ష్ దీప్ సింగ్(13) తో కలిసి తొమ్మిదవ వికెట్ కు 37 పరుగులు జోడించాడు. ఈ పరుగులు టీమిండియా స్కోర్ బోర్డుకు ఎంతో బలంగా మారాయి. వాస్తవానికి బౌలింగ్ లో విఫలమవుతున్న హర్షిత్.. చివరి దశలో బ్యాట్ తో అదరగొట్టడంతో టీం మీడియాలో ఆనందం వ్యక్తం అయింది. అంతేకాదు మైదానంలో మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు కూడా కేరింతలు కొట్టారు. వికెట్ల మధ్య హర్షిత్ అత్యంత వేగంగా పరుగులు పెట్టాడు. వీరిద్దరూ ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించారు. స్టార్క్ బౌలింగ్ నుంచి మొదలు పెడితే జంపా వరకు ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టారు. ముఖ్యంగా జంపా వేసిన మూడో ఓవర్ లో హర్షిత్ ఏకంగా 16 పరుగులు సాధించాడు. ఇందులో మూడు బౌండరీలు ఉండడం విశేషం.
హర్షిత్ చేసింది 24 పరుగులు మాత్రమే అయినప్పటికీ అవి.. టీమ్ ఇండియాకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. కష్టకాలంలో హర్షిత్ బ్యాట్ తో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించాడు అని చెప్పవచ్చు. నితీష్ అవుట్ అయిన తర్వాత టీమిండియా స్వల్ప వ్యవధిలోని ఆల్ అవుట్ అవుతుందని అందరు అనుకున్నారు. ఆస్ట్రేలియా ముందు నామమాత్రమైన స్కోరును లక్ష్యంగా ఉంచుతుందని భావించారు. కానీ అందరి అంచనాలను హర్షిత్ తలకిందులు చేశాడు. ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తూ.. పరుగులు సాధించాడు. మైదానంలో పాదరసం లాగా కదులుతూ కీలకమైన పరుగులు చేసి టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అందువల్లే టీమిండియా ఆస్ట్రేలియా ఎదుట ఏకంగా 265 పరుగుల టార్గెట్ విధించింది. ఈ టార్గెట్ ను ఫినిష్ చేసే క్రమంలో ప్రస్తుతం ఆస్ట్రేలియా ఒక వికెట్ కోల్పోయి 32 పరుగులు చేసింది. ఈ కథనం రాసే సమయం వరకు 8 ఓవర్లు పూర్తి అయిపోయాయి. హెడ్(19), షార్ట్(1) క్రీజులో ఉన్నారు. కెప్టెన్ మార్ష్(11) 11 పరుగులు చేసి అర్ష్ దీప్ సింగ్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.