India vs Australia 2nd ODI Updates: క్రికెట్లో ప్రయోగాలు చేయాలి. అవి జట్టుకు మేలు చేసే విధంగా ఉండాలి. కానీ చేసే ప్రయోగాలు జట్టు మొత్తాన్ని ముంచే విధంగా ఉండకూడదు. ఇప్పుడు టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్ చేసిన పని కూడా అలానే ఉంది. పనిమంతుడని తాపీ చేతికిస్తే.. కుక్క తోక తగిలి ఇల్లు మొత్తం కూలిపోయిందట.. ఇప్పుడు ఈ సామెత తీరుగానే గంభీర్ శిక్షణ ఉంది.
వాస్తవానికి టెస్ట్ సిరీస్ లో టీం ఇండియా ఇటీవల కాలంలో పర్వాలేదనిపించే స్థాయిలోనే విజయాలు సాధిస్తోంది. ఇంగ్లాండ్ జట్టుపై హోరాహోరీ గా ఆడింది. టెస్ట్ సిరీస్ ను సమం చేసింది. స్వదేశంలో వెస్టిండీస్ జట్టు పై టెస్ట్ సిరీస్ గెలిచింది. ఇక టి20 విషయానికి వస్తే ఆసియా కప్ లో అదరగొట్టింది. వన్డే ఫార్మేట్ లో ఛాంపియన్స్ ట్రోఫీ లో సూపర్ సత్తా చాటి.. విజయాన్ని సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా లో గంభీర్ మళ్లీ ప్రయోగాలు మొదలుపెట్టాడు. ఈసారి మిషన్ వన్డే వరల్డ్ కప్ అంటూ.. విజయవంతమైన సారధిగా పేరుపొందిన రోహిత్ శర్మ పక్కనపెట్టాడు. అతడి స్థానంలో పాతిక సంవత్సరాల గిల్ కు జట్టు బాధ్యతలు అప్పగించాడు. కానీ గౌతమ్ గంభీర్ చేసిన పని అత్యంత దారుణంగా ఉంది. గిల్ రెండు వన్డేలలో విఫలమయ్యాడు. ఆటగాడిగా సత్తా చూపించలేకపోయాడు. సారధిగా విఫలమయ్యాడు. అసలు ఇటువంటి వ్యక్తి 2027 వన్డే వరల్డ్ కప్ లో టీమిండియాను విజేతగా ఎలా నిలపగలడు? ఇదే ఇప్పుడు సగటు అభిమాని మదిలో మెదులుతున్న ప్రశ్న.
పెర్త్ వన్డేలో వర్షం కురవడం వల్ల మ్యాచ్ నిర్వహణ ఇబ్బందికరంగా మారింది. పైగా మైదానంపై తేమ ఉండడంతో ఆటగాళ్లకు స్వేచ్ఛగా ఆడే అవకాశం లేకుండా పోయింది. కానీ అడిలైడ్ వన్డేలో ఏమాత్రం భారత ఆటగాళ్లు సత్తా చూపించలేకపోయారు. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. గిల్ కూడా అతడి దారిని అనుసరించాడు. కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు దారుణంగా విఫలమయ్యారు. వాస్తవానికి ఆస్ట్రేలియా గడ్డమీద యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలి అనుకునే నిర్ణయం చాలా మంచిదే. కానీ జట్టుకు ఉపయోగపడే వారికి అవకాశాలు ఇస్తే బాగుండేది. ఈ విషయంలో ఆస్ట్రేలియా చేసిన ప్రయోగం విజయవంతం అయితే.. టీమిండియా చేసిన ప్రయోగం అట్టర్ ప్లాప్ అయింది. ఈ ఏడాది ఇప్పటివరకు టీం ఇండియా ఒక వన్డే సిరీస్ కూడా కోల్పోలేదు. ఒక వన్డే మ్యాచ్లో కూడా ఓటమి ఎదురు కాలేదు. కానీ గంభీర్ చేసిన నెత్తి మాసిన ప్రయోగాల వల్ల టీమిండియా వరుసగా రెండు వన్డేలలో ఓడిపోవలసి వచ్చింది. అంతకంటే దారుణంగా సిరీస్ కూడా కోల్పోవాల్సి వచ్చింది.