India vs Australia 2nd ODI: గెలిచే మ్యాచ్ ఓడిపోతే ఎలా ఉంటుంది? వచ్చిన అవకాశాలను చేతులారా జారవిడుచుకుంటే ఆ బాధ ఎలా ఉంటుంది? విజయ గర్జన చేయాల్సిన చోట పరాభవంతో తల దించుకుంటే ఎలా ఉంటుంది? ఇన్ని ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం టీమిండి అని చెప్పవచ్చు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా దక్కించుకుంది అని చెప్పడానికంటే.. టీమిండియా చేతులారా ఓడిపోయింది అని చెప్పడం సబబు.
బంతిని అద్భుతంగా మెలితిప్పి.. ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపించే జైస్వాల్ రిజర్వ్ బెంచుకు పరిమితమయ్యాడు. చూస్తుండగానే పరుగుల ప్రవాహాన్ని సృష్టించే జైస్వాల్ ఓ మౌన ప్రేక్షకుడిగా మిగిలిపోయాడు. ఇంకా ఎంతమంది ప్రతిభ ఉన్న ప్లేయర్లు మొత్తం జస్ట్ డ్రింకింగ్ బాయ్స్ అవతారం ఎత్తారు. ఆస్ట్రేలియా మైదానాలు అత్యంత కఠినంగా ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఎవరూ ఊహించలేరు. ఇలాంటప్పుడు ఆస్ట్రేలియాతో తలపడే టీమిండియా అత్యంత పటిష్టంగా ఉండాలి. బ్యాటింగ్ నుంచి మొదలుపెడితే ఫీల్డింగ్ వరకు అన్ని విభాగాలలో బలంగా ఉండాలి. కానీ ఇదే టీమ్ ఇండియాలో లోపించింది. సామర్థ్యం ఉన్న ప్లేయర్లను పక్కనపెట్టి.. క్లిష్ట పరిస్థితుల్లో తలవంచే ప్లేయర్లకు అవకాశం ఇవ్వడంతో ఆస్ట్రేలియాకు విజయం ఈజీ అయిపోయింది. ట్రోఫీ సొంతం అయిపోయింది. టీమిండియా కు ఈ సీజన్లో వరుస ఓటములతో పాటు.. ట్రోఫీ కూడా దూరమైపోయింది.
టీమిండియా సిరీస్ కోల్పోయిన తర్వాత ఇప్పుడు అన్ని వేళ్ళూ గౌతమ్ గంభీర్ ను చూపిస్తున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ లో టీమిండియాను విజేతను చేసిన తర్వాత ఎటువంటి కారణం చెప్పకుండానే సారథి స్థానం నుంచి రోహిత్ శర్మను తప్పించారు. ఆస్థానంలో గిల్ ను పెట్టారు. రెండు వన్డేలలో అతడు సింగిల్ డిజిట్ స్టార్ అయిపోయాడు. హర్షిత్ రాణా ను తీసుకుంటే.. అతడేమో స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేకపోయాడు. నితీష్ కుమార్ రెడ్డి చేతులెత్తేశాడు. ఇలా కీలకమైన స్థానాలలో ప్లేయర్లు సరిగా ఆడలేక పోవడంతో గౌతమ్ గంభీర్ ప్లాన్ అట్టర్ ప్లాఫ్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి లోపాలు.
2027 వరల్డ్ కప్ నాటికి టీమిండియాలో యువ రక్తాన్ని నింపాలని గౌతమ్ గంభీర్ భావిస్తున్నాడు. వాస్తవానికి ఆలోచన చాలా మంచిదే. కాకపోతే ఆస్ట్రేలియా లాంటి కఠినమైన మైదానాలపై ఆడుతున్నప్పుడు సీనియర్లకు చోటు ఇవ్వాలి. అలాకాకుండా ఎటువంటి అనుభవం లేని ప్లేయర్లకు అవకాశాలు ఇస్తే ఇదిగో టీం ఇండియా ఇలాంటి మూల్యాలను చెల్లించుకోవాల్సి వస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్.. ఇలా పరిమిత ఓవర్లలో టీమిండియా ఇటీవల విజయాలు సాధించింది.. కానీ ఆ పరంపరకు గౌతమ్ గంభీర్ తన ఒంటెత్తు పోకడలతో బ్రేక్ వేశాడు. ఇలా వరుస రెండు ఓటములు ఏదైనా తర్వాత.. టీమ్ ఇండియా ఆట తీరు మారుతుందా? గిల్ నాయకుడిగా ఆకట్టుకుంటాడా? మిగతా ప్లేయర్లు అంచనాలకు మించి రాణిస్తారా? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుంది. అన్నట్టు కొంతమంది ప్లేయర్లు మాత్రమే జట్టుకు విజయాలు అందిస్తారని గౌతమ్ గంభీర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ అన్ని రోగాలకు జిందాతిలిస్మాతే మందు కాదనే విషయం గౌతమ్ గంభీర్ కు ఎప్పుడు అర్థమవుతుందో?!
