India vs England Test : 371 రన్స్ టార్గెట్ టీమిండియా విధించడంతో.. ఇంగ్లాండ్ ఈ లక్ష్యాన్ని చేదించలేదని అందరూ అనుకున్నారు. కానీ వారందరి అంచనాలను ఇంగ్లాండు జట్టు తలకిందులు చేసింది. ఏ దశలోనూ ఓటమి దశగా ఇంగ్లాండ్ అడుగులు వేయలేదంటే ఆ జట్టులో ఉన్న ఆటగాళ్లలో ఏ స్థాయిలో ఆత్మవిశ్వాసం ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఆరు పరుగులు వెనుకబడిపోయినప్పటికీ.. చెప్పుకునే స్థాయిలో సెంచరీలు నమోదు కాలేకపోయినప్పటికీ ఇంగ్లాండ్ ఊహించని విజయాన్ని అందుకుంది. అసాధ్యం అనుకున్న లక్ష్యాన్ని చేదించి వారేవా అనిపించింది.. వాస్తవానికి టెస్ట్ క్రికెట్లో 371 రన్స్ టార్గెట్ చేజ్ చేయడం అంత ఈజీ కాదు. కానీ దీనిని వాస్తవంలో చేసి చూపించింది ఇంగ్లాండ్.
ఓటమికి కారణాలు ఇవే
అంతకుమించి అనే రేంజ్ లో టార్గెట్ విధించినప్పటికీ టీం ఇండియా ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.. రెండు ఇన్నింగ్స్ లో ఇండియన్ లోయర్ ఆర్డర్ దారుణంగా పతనమైంది. అప్పటిదాకా పటిష్ట స్థితిలో ఉన్న ఇండియా ఒక్కసారిగా తేలిపోయింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో తొలి మూడు వికెట్ల వరకు ఇండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఆ తదుపరి 7 వికెట్లు కేవలం 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో కేవలం 31 పరుగుల వ్యవధిలోనే ఇండియా ఆరు వికెట్లు నష్టపోయింది. ఇక ఫీల్డింగ్లో అత్యంత దారుణంగా ఇండియా ప్లేయర్లు ఆరు క్యాచ్ లు వదిలేశారు.. భారత జట్టు సారధి గిల్ తీసుకున్న రివ్యూలు ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. ఇక ఇంగ్లాండ్ తోని ఇన్నింగ్స్ లో బుమ్రా మాత్రమే అదరగొట్టాడు. అతడు ఏకంగా 5 వికెట్లు పడగొట్టాడు. అతడికి మిగతా బౌలర్ల నుంచి ఏమాత్రం సహకారం లభించలేదు. ఇక ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్ లో బుమ్రా ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. అన్నింటికీ మించి ఇంగ్లాండ్ ఓపెనర్ డకెట్ ఏకంగా 149 పరుగులు చేసి టీమిండియా పతనాన్ని శాసించాడు. ఇవన్నీ కూడా టీమిండియా ఓటమికి కారణాలుగా నిలిచాయి. దాదాపు 400 లోపు పరుగుల టార్గెట్ విధించినప్పటికీ భారత జట్టు ఓడిపోవడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. అసలు ఆటగాళ్ల ఆట తీరును తీవ్రంగా విమర్శిస్తున్నారు. యంగ్ ఇండియా అంటే ఇలా ఓడిపోవడమే అంటూ వారు మండిపడుతున్నారు. “జట్టులోకి యువ ఆటగాళ్లను తీసుకున్నామని చెప్పారు. యువ రక్తాన్ని ఎక్కించామని గొప్పలు చెప్పారు. విలేకరుల సమావేశంలో టీమిండియా గురించి ఒక రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చారు. చివరికి ఇదిగో ఇలా జరిగిపోయింది.. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. ఇప్పటికైనా జట్టులో ప్రక్షాళన అవసరం.. కొంతమంది ప్లేయర్లకు విశ్రాంతి ఇచ్చి వారి స్థానంలో మిగతా వారిని తీసుకోవాలని” సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.