ACC Emerging Teams of Asia Cup 2024 : ఈ టోర్నీలో తిలక్ ఆధ్వర్యంలోని భారత్ – ఏ జట్టు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించింది. ఫలితంగా సెమీఫైనల్ దాకా వచ్చింది. అయితే శుక్రవారం రాత్రి ఆఫ్గనిస్తాన్ – ఏ జట్టుతో జరిగిన సెమీఫైనల్ -2 మ్యాచ్ లో తడబడింది. పోరాడాల్సిన చోట చేతులెత్తేసింది. దీంతో ఓటమిపాలై నిరాశతో వెనుదిరిగింది. ఈ మ్యాచ్ లో అన్ని విభాగాలలో ఆఫ్గనిస్తాన్ అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించి.. 20 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఫైనల్ వెళ్ళింది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టపోయి 206 రన్స్ చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు సెది ఖుల్లా 83, జుబైద్ 64 పరుగులు చేశారు. వీరిద్దరూ మైదానంలో పెను విధ్వంసాన్ని సృష్టించారు. తొలి వికెట్ కు ఏకంగా 137 పరుగుల పార్ట్ నర్ షిప్ నెలకొల్పారు. తర్వాత కూడా బ్యాటర్లు అదే ఊపు కొనసాగించారు. చివర్లో కరీం(41) సునామీని సృష్టించాడు. భారత బౌలర్లలో రసిక్ (3/25), ఆకిబ్(1/48) సత్తా చాటారు..
187 పరుగులే చేసింది
అనంతరం టార్గెట్ చేజ్ చేయడానికి రంగంలోకి దిగిన టీమిండియా నిర్ణ నిర్ణలలో 7 వికెట్లు కోల్పోయి 187 రన్స్ మాత్రమే చేసింది. రమణ్ దీప్ సింగ్ (64) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆయుష్ బదోని(31) సత్తా చాటాడు. లక్ష్యం భారీగా ఉండడంతో.. భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడాలని భావించారు. అయితే చివర్లో ఒత్తిడిని తట్టుకోలేక వికెట్లు పోగొట్టుకున్నారు. అభిషేక్ శర్మ (7), తిలక్ వర్మ (16) కీలకమైన సమయంలో విఫలమయ్యారు. నేహాల్ వదేరా(20), నిశాంత్ సింధు(23) దూకుడుగా ఆడినప్పటికీ.. వాటిని భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లో గజన్ ఫర్, అబ్దుల్ రెహమాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. షెరా ఫుదీన్, అష్రఫ్ చెరో వికెట్ పడగొట్టారు. కాగా, ఇప్పటికే శ్రీలంక జట్టు ఫైనల్ వెళ్ళింది. ఆ జట్టుతో ఆదివారం ఆఫ్గనిస్తాన్ తలపడుతుంది. కాగా ఇటీవల పాకిస్తాన్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో శ్రీలంక జట్టు గెలుపును సొంతం చేసుకుంది. కాగా, భారత జట్టుతో మ్యాచ్ కు ముందు తాము సంచలన ఆట తీరు ప్రదర్శిస్తామని ఆఫ్ఘనిస్తాన్ ప్రకటించింది. ఆ జట్టు అన్నంత పనీ చేసి ఔరా అనిపించింది. అయితే ఈ మ్యాచ్ లోన్ తిలక్ వర్మ, అభిషేక్ శర్మ విఫలమవడం టీమిండియా విజయంపై తీవ్రమైన ప్రభావం చూపించింది. వారు కనుక నిలబడి ఉండి ఉంటే మ్యాచ్ ఫలితం మరో విధంగా ఉండేదని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.