ఆస్ట్రేలియాపై టీమిండియా అనితర సాధ్యమైన విజయం సాధించింది. 32 ఏళ్లుగా ఓటమెరుగని బ్రిస్బేన్‌లో కంగారూలను మట్టికరిపించింది. గబ్బా కోటను బద్దలు కొట్టింది. 3 వికెట్ల తేడాతో చివరి టెస్ట్‌లో గెలిచి 2–1తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్ (91), రిషబ్ పంత్(89 నాటౌట్) ఫైటింగ్ ఇన్నింగ్స్‌తోపాటు ఆస్ట్రేలియా పేసర్ల బౌన్సర్లకు శరీరమంతా గాయపడినా పోరాడిన పుజారా (56) టెస్ట్ క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన విజయాన్ని సాధించిపెట్టారు. 328 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి విజయపతాకాన్ని అందుకున్నారు. చివరి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్ టెస్ట్ క్రికెట్‌లోని అసలైన మజాను రుచి చూపించింది.
Also Read: ఆస్ట్రేలియాతో 4వ టెస్ట్: భారత్ ను ఊరిస్తున్న విజయం
ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడు వందలకుపైగా స్కోర్లు చేజ్ చేసి గెలవడం ఇది కేవలం మూడోసారి మాత్రమే. అది కూడా ఆస్ట్రేలియా గడ్డపై. అందులోనూ ఇప్పటి వరకూ ఎప్పుడూ గెలవని బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో ఇంత భారీ స్కోరు ఛేదించడం అనేది సాధారణ విషయం కాదు. చివరి రోజు వికెట్ నష్టపోకుండా 4 పరుగులతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియా.. 18 పరుగుల దగ్గరే రోహిత్ శర్మ (7) వికెట్ కోల్పోయింది. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. గిల్‌తో కలిసి పుజారా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఆ తర్వాత రెండో సెషన్‌లో సెంచరీకి కేవలం 9 పరుగుల దూరంలో శుభ్‌మన్ గిల్ (91) ఔటయ్యాడు. ఆ కాసేపటికే రహానే (24) కూడా పెవిలియన్ చేరాడు. దీంతో టీమిండియా 167 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఆస్ట్రేలియా తన రెండు ఇన్నింగ్స్‌లో 369, 294 పరుగులు చేసి ఆలౌట్ అవగా.. భారత్ 336 ఆలౌట్, 329/7 విజేతగా నిలిచింది. ఈ విజయంతో ఇంతకాలం ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్ అడ్రస్‌గా చెబుతున్న గబ్బా స్టేడియాలో టీమిండియా జబ్బ చరిచింది. ఆస్ట్రేలియా గెలుపునకు కేరాఫ్ బ్రిస్బేన్ అని చెబుతున్న చరిత్ర రికార్డులను తిరగరాసింది. 32 ఏళ్ల నాటి చరిత్రను తిరగరాస్తూ ఆసిస్‌కు ఓటమి రుచి చూపించారు భారత యువ క్రికెటర్లు. మొత్తంగా ఒక మ్యాచ్ డ్రా అవగా.. 2-1 తేడాతో సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది.
Also Read: 7 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా.. భారత్ కు లక్కీ ఛాన్స్?
కోహ్లీ, రాహుల్, జడేజా, అశ్విన్, బుమ్రా, విహారీ వంటి సీనియర్ ప్లేయర్లు మ్యాచ్‌కు దూరమైనా.. యువ క్రికెటర్లు తమ సత్తా చాటారు. అసలు డ్రా అయితేనే గొప్ప అనుకున్న నాలుగో టెస్ట్‌లో ఘన విజయం సాధించి విమర్శకుల నోళ్లు మూయించారు. భారత్ విజయంలో రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్, పుజారా కీలక పాత్ర పోషించారు. గబ్బా స్టేడియం వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున భారత బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడుతూనే తమ బ్యాట్స్‌ను ఝుళిపించారు. ఆసిస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ కంగారూలు విదిల్చిన లక్ష్యాన్ని చేధించారు. నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో రెండింట భారత జట్టు గెలుపొందగా.. ఒక మ్యాచ్ డ్రా గా ముగిసింది. కాగా, చివరి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 91 పరుగులతో పునాది వేయగా.. రిషబ్ పంత్ 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇక పుజారా 56 పరుగులు చేశాడు. ఇక హైదరాబాదీ అయినా సిరాజ్ ఐదు వికెట్లు తీసి ఆసిస్‌ను చావుదెబ్బ తీశాడు.