Homeక్రీడలుక్రికెట్‌India Champions VS Pakistan Champions :పాక్ అంటే చాలు..మనోళ్లు శివాలెత్తుతారు.. కప్ సాధిస్తారు.. ఛాంపియన్...

India Champions VS Pakistan Champions :పాక్ అంటే చాలు..మనోళ్లు శివాలెత్తుతారు.. కప్ సాధిస్తారు.. ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీ లోనూ అదే జరిగింది

India Champions VS Pakistan Champions  పాక్.. ఈ పేరు వినిపిస్తే చాలు మన క్రికెటర్లలో ఎక్కడా లేని కసి పెరుగుతుంది..ఉరిమే స్థాయిలో ఉత్సాహం తొణికిసలాడుతుంది. ఇటీవల టి20 వరల్డ్ కప్ లో టీమిండియా పాకిస్తాన్ పై తక్కువ స్కోరు చేసినప్పటికీ.. ఆ పరుగులను కాపాడుకుంది. శనివారం జరిగిన ఛాంపియన్ షిప్ ఆఫ్ లెజెండ్స్ క్రికెట్ టోర్నీ ఫైనల్స్ లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.. 157 పరుగుల విజయ లక్ష్యాన్ని యువరాజ్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 19.1 ఓవర్లలో ఛేదించింది.. అంబటి రాయుడు అర్ద శతకంతో ఆకట్టుకున్నాడు. చివర్లో యూసఫ్ పఠాన్ అద్భుతమైన సహకారం అందించాడు..

ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.. షోయబ్ మాలిక్ 36 బంతుల్లో మూడు సిక్సర్ల సహాయంతో 41 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సోహైల్ తన్వీర్ 9 బంతుల్లో 19 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. భారత బౌలర్ అను రీత్ సింగ్ 43/3 తో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఇర్ఫాన్ పఠాన్ 12/1, పవన్ నేగి 24/1, వినయ్ కుమార్ 36/1 తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. మాలిక్, సోహైల్ తన్వీర్ చివర్లో దూకుడుగా ఆడటంతో పాకిస్తాన్ ఆ స్కోర్ చేయగలిగింది.

157 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు మెరుగైన ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్ కు 34 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ దశలో రాబిన్ ఊతప్ప ఔటయ్యాడు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన గురు కీరత్ సింగ్ మాన్ తో కలిసి అంబటి రాయుడు మూడో వికెట్ కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. రాయుడు 30 బంతుల్లో ఏకంగా 50 పరుగులు చేశాడు .. ఇతడి ఇన్నింగ్స్ లో రెండు సిక్సర్లు, ఐదు ఫోర్లు ఉన్నాయి. లక్ష్యం దిశగా సాగుతున్న భారత జట్టుకు అంబటి రాయుడు ఔట్ కావడంతో ఒక్కసారిగా బ్రేక్ పడింది. సయ్యద్ అజ్మల్ వేసిన బంతికి అంబటి రాయుడు క్యాచ్ ఔట్ గా వెనుతిరిగాడు. మరోవైపు 34 పరుగులు చేసిన గురు కీరత్ ను షోయబ్ మాలిక్ వెనక్కి పంపించాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 108/4 వద్ద నిలిచింది. యూసఫ్ పఠాన్ 16 బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టి దూకుడుగా ఆడాడు. యువరాజ్ సింగ్ 22 బంతుల్లో 15 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ 5.4 ఓవర్లు ఆడి 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. యూసఫ్ భారీ షాట్లు కొట్టగా.. యువరాజ్ సింగ్ తన సహజ శైలికి భిన్నంగా నిదానంగా ఆడాడు. అయితే ఐదో వికెట్ కు వీరిద్దరూ నెలకొల్పిన భాగస్వామ్యం వల్ల భారత్ విజయం సాధించింది.

19 ఓవర్లో వాహబ్ రియాజ్ యూసఫ్ పఠాన్ ను ఔట్ చేయడంతో కాస్త ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టుపై ఒత్తిడి పెంచనీయలేదు. సోహైల్ తన్వీర్ చివరి ఓవర్ వేయగా.. మొదటి బంతిని ఫోర్ గా మలచి.. ఇర్ఫాన్ పఠాన్ భారత జట్టును గెలిపించాడు. దీంతో యువరాజ్ సింగ్ ఆధ్వర్యంలోని భారత లెజెండ్స్ జట్టు పాక్ ను మట్టి కరిపించి.. ట్రోఫీని దక్కించుకుంది. విజయం అనంతరం భారత ఆటగాళ్లు సంబరాలలో మునిగి తేలారు.

Bhaskar
Bhaskarhttps://oktelugu.com/
Bhaskar Katiki is the main admin of the website
RELATED ARTICLES

Most Popular