Rohit Sharma : అదే దరిద్రం.. అదే చండాలం. అదే నిర్లక్ష్యం. వేదిక మారుతోంది. ఫార్మాట్ మారుతోంది. ఆట తీరు మాత్రం మారడం లేదు. ఆ ఇష్టానుసారం తగ్గడం లేదు. ఎంతసేపటికి ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నాడు. అలాగని అతడేమీ అనామక ఆటగాడు కాదు. జట్టులోకి కొత్తగా వచ్చినవాడు అంతకన్నా కాదు. జట్టు నాయకుడిగా.. ఎన్నో విజయాలు అందించిన సారధిగా.. స్ఫూర్తిదాయకమైన ఆట తీరు ప్రదర్శించిన ఆటగాడిగా అతనికి పేరు ఉంది. కానీ గతమంతా ఘనం అన్నట్టుగా అతడి వ్యవహారం సాగిపోతోంది.
పై ఉపోద్ఘాతం మొత్తం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గురించి. గత ఆరు నెలలుగా ఎర్ర బంతి క్రికెట్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. చివరికి తనకు ఎంతో ఇష్టమైన వైట్ బాల్ ఫార్మాట్ లోనూ అతడు అదే తీరు కొనసాగిస్తున్నాడు. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ జట్టుతో నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో రోహిత్ దారుణంగా ఆడాడు. ఎన్నో అంచనాల మధ్య మైదానంలోకి వచ్చిన అతడు ఏడు బంతుల్లో రెండు పరుగులు మాత్రమే చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు.. సకీబ్ మహమ్మద్ వేసిన ఆరో ఓవర్ లోని రెండో బంతిని రోహిత్ ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే దాని కంటే ముందు రోహిత్ తొందరపాటుతో గాల్లోకి బంతి లేచింది. ఈ క్యాచ్ ను ఇంగ్లాండ్ ఫీల్డర్ లియామ్ లివింగ్ స్టోన్ ఎలాంటి తప్పుకు ఆస్కారం ఇవ్వకుండా అందుకున్నాడు. ఫలితంగా రోహిత్ నిరాశ చెందుతూ.. పెవిలియన్ చేరుకున్నాడు.
మండిపడుతున్నారు
దారుణమైన షార్ట్ ఆడి ఔట్ అయిన రోహిత్ పై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా దారుణమైన విమర్శలు చేస్తున్నారు. రోహిత్ భయ్యా నువ్వు ఏమైనా మ్యాగీ తింటున్నావా..మరీ రెండు నిమిషాలే నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఓ హీరోయిన్ పురుషుల సామర్థ్యాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను..నెటిజన్లు ప్రస్తావిస్తూ రోహిత్ శర్మను తీవ్రంగా విమర్శిస్తున్నారు.. మ్యాగీ చేసుకునే లోపే రోహిత్ ఔటై డ్రెస్సింగ్ రూమ్ కు వస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇలా చెత్తగా ఆడటంకంటే రిటైర్మెంట్ ప్రకటించడం ఉత్తమం అని వారు సూచిస్తున్నారు. దరిద్రమైన ఆట తీరుతో.. నిర్లక్ష్యమైన ప్రదర్శనతో రోహిత్ జట్టుకు అంతకంతకూ భారంగా మారిపోతున్నాడని నెటిజన్లు పేర్కొంటున్నారు.
నాగ్ పూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి 47.4 ఓవర్లలో 248 రన్స్ కు కుప్పకూలింది. ఇంగ్లాండ్ కెప్టెన్ బట్లర్ 52, బెతెల్ 51 పరుగులతో ఆకట్టుకున్నారు. రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా చెరి మూడు వికెట్లు సాధించారు. మహమ్మద్ షమీ, కులదీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలా ఒక వికెట్ పడగొట్టారు.. ఇక ఇంగ్లాండ్ విధించిన 249 రన్స్ టార్గెట్ ను భారత్ 38.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి ఛేదించింది. గిల్ 87 పరుగులు చేసి అదరగొట్టాడు.. అయ్యర్ 59 పరుగులతో సత్తా చాటాడు. అక్షర్ పటేల్ 52 పరుగులతో వారెవా అనిపించాడు. 19 పరుగులకే ఓపెనర్లు ఇద్దరు అవుట్ అయిన నేపథ్యంలో.. గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడారు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. ఇక ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ కు ఇంగ్లాండ్ పేలవమైన ఫీల్డింగ్ తోడు కావడం విశేషం. ఈ గెలుపు ద్వారా మూడు వన్డేల సిరీస్ లో భారత్ 1-0 తో లీడ్ లోకి వచ్చింది. ఇక ఆదివారం కటక్ వేదికగా రెండవ వన్డే జరుగుతుంది.