Asia Cup India vs Pakistan: ఆసియా కప్ లో పాకిస్తాన్ ప్రస్థానం ఏమాత్రం బాగోలేదు. సూపర్ -4 లోకి వెళ్లాలంటే కచ్చితంగా బుధవారం జరిగే మ్యాచ్లో యూఏఈ పై గెలవాలి. పాకిస్తాన్ జట్టు భారత్ చేతిలో ఓడిపోవడంతో.. ఒక రకంగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. దీనికి తోడు గడచిన మ్యాచ్లో యూఏఈ విజయం సాధించింది. ఏ క్షణమైనా సరే సంచలన ఆట తీరుతో ఆకట్టుకోవాలని భావిస్తోంది. దీంతో బుధవారం జరిగే పాకిస్తాన్, యూఏఈ మ్యాచ్ ఉత్కంఠ గా సాగుతుందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఒకవేళ ఈ మ్యాచ్లో కనుక పాకిస్తాన్ ఓడిపోతే ఇంటికి వెళ్లడం ఖాయం. సొంత దేశం అభిమానుల మద్దతు ఉండడంతో యూఏఈ సంచలన ఆటతీరు ప్రదర్శిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఇటీవల మ్యాచ్లో భారత జట్టు సారథి సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదని పాకిస్తాన్ ప్లేయర్లు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ఏకంగా తమ ఆగ్రహాన్ని ఐసీసీ ఎదుట వ్యక్తం చేశారు. ఐసీసీ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో పాకిస్తాన్ నిశ్శబ్దంగా ఉండిపోక తప్పలేదు. దీనికి తోడు సోషల్ మీడియాలో పాకిస్తాన్ జట్టు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం కావడంతో.. ఆ జట్టు ఆటగాళ్లకు ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఇది ఇలా ఉండగానే పాకిస్తాన్ జట్టు మీద కారం చల్లే విధంగా భారత్ వ్యవహరించింది.
యూఏఈ తో జరిగే మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ మంగళవారం దుబాయ్ వెళ్లిపోయింది.. దుబాయ్ లోనే భారత ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. బుధవారం భారత ప్లేయర్లు సాధన చేస్తుండగా.. సడన్గా పాకిస్తాన్ ప్లేయర్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే రెండు జట్లకు వేరువేరుగా కేటాయించిన నెట్స్లో ఆటగాళ్లు సాధన చేశారు. పాకిస్తాన్ ప్లేయర్లు సాధన చేస్తుంటే.. భారత ప్లేయర్లు రెట్టించిన ఉత్సాహంతో ప్రాక్టీస్ చేశారు. దీంతో పాకిస్తాన్ ప్లేయర్లు కాసేపు ఇబ్బంది పడ్డారని.. ఆ తర్వాత సాధన చేశారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. భారత ప్లేయర్లు ఉత్సాహంగా సాధన చేస్తూ ఉంటే పాకిస్తాన్ ప్లేయర్లు చూస్తూ ఉండిపోయారని.. ఒకరకంగా భారత ఆటగాళ్లు తమ సాధన ద్వారా పాకిస్తాన్ జట్టు పై కారం చల్లిన విధంగా ప్రవర్తించారని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.