IND Vs BAN : బంగ్లా పై గెలుపుతో టీమిండియా సరికొత్త చరిత్ర.. ఆ జాబితాలో నాలుగో జట్టుగా అరుదైన ఘనత

బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో భారత్ తొలి మ్యాచ్ గెలిచింది . కేవలం మూడు రోజుల్లోనే గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. 250 పరుగుల భారీ తేడాతో గెలుపును సొంతం చేసుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 22, 2024 12:57 pm

Team India Test wins

Follow us on

IND Vs BAN :  ఈ విజయం ద్వారా భారత జట్టు అరుదైన ఘనత సొంతం చేసుకుంది. భారత జట్టు టెస్ట్ క్రికెట్లో విజయాల శాతాన్ని పెంచుకుంది. భారత జట్టు ఇప్పటివరకు 580 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. ఇందులో 179 విజయాలు ఉన్నాయి. 178 అపజయాలు ఉన్నాయి. 222 మ్యాచ్ లు డ్రా గా మారాయి.. ఒక మ్యాచ్ లో ఫలితం తీరలేదు. 1932 జూన్ 25న భారత్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడింది. 92 సంవత్సరాల చరిత్రలో భారత్ విజయాల శాతాన్ని పెంచుతుంది. 1932 నుంచి టెస్ట్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టినప్పటికీ 20 సంవత్సరాల దాకా భారత జట్టుకు తొలి గెలుపు దక్కలేదు. 1988 వరకు ఈ ఒక్క ఏడాదిని కూడా ఎక్కువ శాతం గెలుపుతో ముగించలేదు. 2009 లో భారత జట్టు 100వ టెస్టు మ్యాచ్ లో విజయం సాధించింది. అప్పటికీ భారత జట్టు 432 టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. అందులో విజయాల శాతం 23.14 మాత్రమే. ఈ ప్రకారం నాలుగు మ్యాచ్ ల్లో తలపడితే.. ఒకదాంట్లో కూడా విజయం సాధించలేని దురవస్థ. అయితే గత దశాబ్దంన్నర భారత టెస్ట్ క్రికెట్ మారిపోయింది..

15 సంవత్సరాలలో..

15 సంవత్సరాలలో భారత్ 148 మ్యాచ్ లు ఆడింది. 80 మ్యాచ్ లలో గెలిచింది. గెలుపు శాతాన్ని పెంచుకుంది. జట్టులో యువకులు రావడం.. టెస్ట్ క్రికెట్ ను సమర్థవంతంగా ఆడటం… బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలకు కోచ్ లు రావడంతో జట్టు అత్యంత పటిష్టంగా మారింది. అందువల్లే వరల్డ్ టెస్ట్ ర్యాంకింగ్ లో బలమైన ఆస్ట్రేలియాను అధిగమించి నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ వెళ్లిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. తాజాగా బంగ్లా జట్టుతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో గెలవడం ద్వారా అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన నాలుగవ జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది.. ఇక మిగతా సిరీస్ లలోనూ భారత్ విజయం సాధిస్తే.. అత్యధిక గెలుపులను సాధించిన మూడవ జట్టుగా రికార్డ్ సృష్టిస్తుంది. భారత టెస్ట్ జట్టుకు 36 మంది నాయకత్వం వహించారు. సీకే నాయుడు మొదటి కెప్టెన్. ప్రస్తుతం రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా టెస్ట్ జట్టు కొనసాగుతోంది. ఇప్పటివరకు 314 క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్ లలో పాలుపంచుకున్నారు. గతంలో టెస్ట్ జట్టులో అంతగా పోటీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు ఒక స్థానం కోసం చాలామంది ఆటగాళ్లు పోటీపడుతున్నారు. టెస్ట్ క్రికెట్ జట్టును మరింత పటిష్టం చేసేందుకు మేనేజ్మెంట్ అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. టెస్ట్ క్రికెట్లో అత్యధిక విజయాలు సాధించిన జట్లలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా తొలి మూడు స్థానాలలో కొనసాగుతున్నాయి.