https://oktelugu.com/

IND Vs AUS BGT 2024 : 14 సంవత్సరాల తర్వాత.. సొంతగడ్డపై ఆస్ట్రేలియా పొగరును నేలకు దించిన టీమిండియా..

స్వదేశంలో ఆస్ట్రేలియాకు తిరుగు ఉండదు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలలో ఆస్ట్రేలియా జట్టు అదరగొడుతుంది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బెదరగొడుతుంది. అందువల్లే ఆ జట్టు టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 23, 2024 2:08 pm
    IND Vs AUS BGT 2024

    IND Vs AUS BGT 2024

    Follow us on

    IND Vs AUS BGT 2024 : ప్రత్యర్థులకు దుర్భేద్యమైన షాక్ లు ఇవ్వడంలో ఆస్ట్రేలియా జట్టు తర్వాతే ఎవరైనా. టెస్టులలో సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టుకు తిరుగులేని రికార్డు ఉంది. అయితే ఆ జట్టు పొగరును భారత్ నేలకు దించింది. పెర్త్ వేదికగా జరుగుతున్నట్లు టెస్టులో 104 పరుగులకు కుప్ప కూల్చింది. ఫలితంగా 14 సంవత్సరాల తర్వాత సొంత గడ్డపై ఆస్ట్రేలియా జట్టును నేల నాకించింది. గొప్ప గొప్ప ఆటగాళ్లు ఉన్నప్పటికీ చుక్కలు చూపించింది. సొంత దేశంలో.. సొంత అభిమానుల మధ్య నిప్పులు చెరిగే విధంగా బంతులు వేస్తూ.. వెన్నులో వణుకు పుట్టించింది. హెడ్, స్టార్క్, లబూషేన్, ఖవాజా, స్టీవెన్ స్మిత్, మార్ష్, క్యారీ, కమిన్స్ లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ.. ఆస్ట్రేలియా జట్టు ఏమాత్రం ప్రతిభ చూపు లేకపోయింది. భారత్ కొట్టిన 150 పరుగులు కూడా చేయలేకపోయింది. 104 పరుగులకే ఆల్ అవుట్ అయింది. మిచెల్ స్టార్క్ కనుక 26 పరుగులు చేయకుండా ఉంటే.. ఆస్ట్రేలియా మరి తక్కువ స్కోరు చేయగలిగేది.

    14 సంవత్సరాల తర్వాత..

    కాగా, 104 పరుగులకు ఆలౌట్ అవ్వడం ద్వారా ఆస్ట్రేలియా చెత్త రికార్డ్ నమోదు చేసింది. 14 సంవత్సరాల తర్వాత స్వదేశంలో తక్కువ స్కోర్ చేసింది. 2016లో హోబర్ట్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 85 పరుగులకు ఆల్ అవుట్ అయింది. 2010లో మెల్బోర్న్ వేదికగా జరిగిన టెస్ట్ లో ఇంగ్లాండ్ చేతిలో 98 పరుగులకు ఆల్ అవుట్ అయింది. పెర్త్ వేదికగా 2024లో టీమ్ ఇండియాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 104 పరుగులకు కుప్పకూలింది. 2010లో సిడ్ని వేదికగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 127 రన్స్ కు ఆల్ అవుట్ అయింది. 2011లో హోబర్ట్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియా 136 పరుగులకు కుప్ప కూలింది.

    ఇక ప్రస్తుతం పెర్త్ టెస్టులో భారత్ ఇప్పటివరకు 73 పరుగుల లీడ్ లో కొనసాగుతోంది. శనివారం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ కడపటి వార్తలు అందే సమయానికి వికెట్ కోల్పోకుండా 27 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (14), కేఎల్ రాహుల్ (7) క్రీజ్ లో ఉన్నారు. కాగా, తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ (0) పరుగులకే అవుట్ అయ్యాడు. రాహుల్(26) పరుగులు చేశాడు. అయితే రాహుల్ అవుట్ అయిన విధానం పట్ల సీనియర్ భారత క్రికెటర్లు థర్డ్ అంపైర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ నిర్ణయం వల్ల రాహుల్ అనవసరంగా అవుట్ అయ్యాడని వ్యాఖ్యానించారు. థర్డ్ అంపైర్ ఏ ప్రాతిపదికన అవుట్ చేశారని ప్రశ్నించారు.