https://oktelugu.com/

IND Vs AUS BGT 2024  : తక్కువ పరుగులు చేసినా.. పై చెయ్యే.. ఆస్ట్రేలియాపై టీమిండియా సంచలనం..

వన్డే, టి20 క్రికెట్లోనే కాదు అప్పుడప్పుడు టెస్ట్ క్రికెట్ లోనూ టీమిండియా సంచలనాలు సృష్టిస్తుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోనూ అదే తీరుగా ఆడుతోంది. పెర్త్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ ఆస్ట్రేలియా పై అదిరిపోయే స్థాయిలో ఆట తీరు ప్రదర్శిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 23, 2024 / 02:09 PM IST

    IND Vs AUS BGT 2024

    Follow us on

    IND Vs AUS BGT 2024  : పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు సాధిస్తోంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత 150 పరుగులకే ఆల్ అవుట్ అయినప్పటికీ.. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టును 104 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. ఫలితంగా 46 పరుగుల లీడ్ సాధించింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా స్థిరంగా ఆడుతోంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(29), యశస్వి జైస్వాల్(38) ఆడుతున్నారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 75 పరుగులు జోడించారు. తొలి ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ (0) పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో అతనిపై తీవ్రమైన విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఫలితంగా అతడు రెండవ ఇన్నింగ్స్ లో ధాటిగా ఆడుతున్నాడు. 69 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్ల సహాయంతో 38 పరుగులు చేశాడు. ఇక మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 60 బంతులు ఎదుర్కొని మూడు ఫోర్ల సహాయంతో 29 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో కేఎల్ రాహుల్ 26 పరుగులు చేశాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గట్టిగా నిలబడి ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే థర్డ్ అంపైర్ వివాదాస్పద నిర్ణయం ప్రకటించడంతో అవుట్ అయ్యాడు. థర్డ్ అంపైర్ అలా అవుట్ ఇవ్వడంతో సీనియర్ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఒకవేళ కేఎల్ రాహుల్ నాట్ అవుట్ అయి ఉంటే టీమిండియా మరింత మెరుగైన స్కోర్ చేసేది.

    తక్కువ పరుగులు చేసినప్పటికీ..

    పెర్త్ టెస్టులో టీమిండియా అరుదైన రికార్డు సాధించింది.. 14 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా జట్టును స్వదేశంలో 104 పరుగులకు అలౌట్ చేసిన టీమిండియా.. అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. తక్కువ పరుగులు చేసినప్పటికీ లీడ్ సాధించిన చరిత్రను సృష్టించింది. 2002లో హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా 99 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టును 94 పరుగులకే కుప్ప కూల్చింది. తద్వారా ఐదు పరుగుల లీడ్ సాధించింది. 1936లో లార్డ్స్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ పై భారత్ 147 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టును 134 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. ఫలితంగా 13 పరుగుల లీడ్ సాధించింది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్లో భారత్ 150 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాను 104 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. మొత్తంగా 46 పరుగుల లీడ్ సాధించింది. ఇక వాంఖడే మైదానంలో 1981లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ 179 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టును 166 రన్స్ కు ఆల్ అవుట్ చేసింది. తక్కువ పరుగులు చేసినప్పటికీ ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యాన్ని సాధించి.. టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది.