https://oktelugu.com/

IND vs AUS: తెలుగుతేజం చేతులెత్తేశాడు.. కేఎల్ రాహుల్ తేలిపోయాడు.. ఆస్ట్రేలియా ఎదుట కుప్పకూలిన భారత్..

న్యూజిలాండ్ జట్టు చేతిలో 0-3 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్టు కనిపించడం లేదు. త్వరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉన్న నేపథ్యంలో.. భారత్ - ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 7, 2024 / 03:18 PM IST

    IND vs AUS

    Follow us on

    IND vs AUS: ఆస్ట్రేలియాలో కొద్దిరోజులుగా భారత్ – ఏ జట్టు పర్యటిస్తోంది. అయితే ఆశించినంత స్థాయిలో సత్తా చాటలేకపోతోంది. మొదటి అనధికారిక టెస్టులో విఫలమైన జట్టు.. రెండవ అనధికారిక టెస్ట్ లోనూ అదే తీరుగా వైఫల్యాన్ని ప్రదర్శించింది. రెండవ అనధికారిక టెస్టు గురువారం ప్రారంభమైంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు తొలి ఇన్నింగ్స్ లో 161 రన్స్ కే కుప్ప కూలింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ ను భారత – ఏ జట్టులోకి చేర్పించినప్పటికీ.. అతడి కూడా వైఫల్యాన్ని ప్రదర్శించాడు. కేవలం నాలుగు బంతులు ఎదుర్కొని నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక తెలుగు యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా దారుణమైన ఆట తీరును ప్రదర్శించాడు. 35 బంతుల్లో అతని కేవలం 16 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. భారత – ఏ జట్టులో నితీష్ కుమార్ రెడ్డి కనుక సత్తా చాటితే.. జాతీయ జట్టులోకి తీసుకోవాలని హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుకున్నాడు. కానీ నితీష్ కుమార్ రెడ్డి.. మొదటి అనధికారిక టెస్టులో విఫలమయ్యాడు.. రెండవ టెస్టులోనూ అదే దారిని అనుసరించాడు. యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్(80) పర్వాలేదనిపించాడు. మిగతా ఆటగాళ్లు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు.. ఏకంగా ముగ్గురు బ్యాటర్లు 0 పరుగులకే అవుట్ అయ్యారు. మరో నలుగురు బ్యాటర్లు ఒక్క పరుగు మాత్రమే చేశారు.

    సత్తా చాటిన ఆస్ట్రేలియా బౌలర్లు

    సొంత మైదానంపై ఆస్ట్రేలియా బౌలర్లు సత్తా చాటారు. మైకేల్ మెజర్ నాలుగు వికెట్లు పడగొట్టాడు..బీ వెబ్ స్టర్ మూడు వికెట్లు సాధించాడు. స్కాట్ బోలాండ్, కోరి, నాథన్ మేక్ స్వామి అలా ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 53 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా మైదానం పేస్ బౌలింగ్ కు అనుకూలించడంతో..ఆ దేశ బౌలర్లు పండగ చేసుకున్నారు. భారత ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. పదునైన బౌన్సర్లు సంధిస్తూ వికెట్లు పడగొట్టారు. అభిమన్యు ఈశ్వరన్ 0, రాహుల్ 4, సాయి సుదర్శన్ 0, రుతు రాజ్ గైక్వాడ్ 4, తనుష్ కోటియన్ 0, ఖలీల్ అహ్మద్ 1 పరుగులకే అవుట్ అయ్యి.. పరువు తీసుకున్నారు. అసలు భారత్ పరుగుల ఖాతా ప్రారంభించకుండానే రెండు వికెట్లు కోల్పోయిందంటే ఆస్ట్రేలియా బౌలర్లు ఏ స్థాయిలో బౌలింగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు.