Ants that killed man : మనిషికి చీమలు కూడా శత్రువుగా మారుతున్నాయి. విష సర్పం కాటుతో మనుషులు చనిపోవడం తెలిసిందే. కానీ, చీమలు కూడా మనిషిని చంపుతున్నాయి.
బలవంతుడ నాకేమని
పలువురితో నిగ్రహించి పలుకుట మేలా
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ…!
నేనే బలవంతుడనని, నాకేమీ భయం లేదని నిర్లక్ష్యం చేసి విర్రవీగి, విరోధం తెచ్చుకోవడం మంచిది కాదు. అది అతడికి ఎప్పుడూ హాని కలిగిస్తుంది అంటారు పెద్దరు. బలమైన పాము కూడా చలి చీమలు దాడి చేస్తే వాటిని ఎదుర్కోలేక మరణిస్తుంది అని కవి భావన. ఇది సుమతీ శతకంలోని ఓ పద్యం. కానీ, ఇప్పుడు మనుషులకు కూడా చీమలు శత్రువులా మారుతున్నాయి. మద్యం మత్తు కారణంగా ఓ వ్యక్తిని చీమలు కుట్టి చంపేశాయి. తేలు కుటి, పాము కుట్టి చనిపోవడం సాధరణమే. కానీ, చీమలు కుట్టడంతో చనిపోవడం ఆశ్చర్యం పరుస్తోంది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాలో జరిగింది.
ఏం జరిగిందంటే..
కడప జిల్లా ఎర్రమద్దివారిపల్లెకు చెందిన ద్వారాకానాథరెడ్డి ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి మద్యం తాగు అలవాటు ఉంది. మద్యం తాగితే ఎక్కడ పడితే అక్కడే పడిపోతాడు. సోమవారం(నవంబర్ 4న) ఫుల్లుగా మద్యం తాగి ఊరికి సమీపంలో పడిపోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న ద్వారాకనాథరెడ్డిని చీమలు చుట్టుముట్టాయి. కుట్టడం ప్రారంభించాయి. ఒకటి, రెండుతో మొదలై దండయాత్ర వందలు, వేలకు పెరిగింది. అలా చీమలు కుట్టడంతో ద్వారకనాథరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి రక్తం కారుతున్న అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య సిబ్బంది సూచన మేరకు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ
రెండు రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందిన ద్వారాకనాథరెడ్డి పరిస్థితి విషమించి బుధవారం(నవంబర్ 7న) మరణించాడు. చీమల కుట్టటడం వల్ల రక్తస్రావం కావడం, బాడీ ఇన్ఫెక్ట్ అయిందని వైద్యులు తెలిపారు. అందులో మద్యం సేవించడం వలన ప్రాణాలు పోయాయని పేర్కొన్నారు.