IND Vs PAK: మహిళల ప్రపంచ కప్ లో టీమిండియా మరో విజయాన్ని సాధించింది.. తొలి మ్యాచ్ లో శ్రీలంకపై అద్భుతమైన గెలుపును దక్కించుకున్న భారత మహిళల జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై కూడా అదే ఫలితాన్ని అందుకుంది. తద్వారా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని.. ట్రోఫీని సాధించడానికి బలమైన అడుగులు వేసింది.
కొలంబోలోని ప్రేమ దాస మైదానంలో జరిగిన ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు టాస్ గెలిచింది. పిచ్ పరిస్థితులను ఏమాత్రం అంచనా వేయలేక పాకిస్తాన్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. వచ్చిన అవకాశాన్ని భారత ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. కీలకమైన భాగస్వామ్యాలు నమోదు అవుతున్న తరుణంలో భారత ప్లేయర్లు అవుట్ కావడంతో.. భారీ స్కోరు సాధ్యం కాలేదు. చివరి ఓవర్లలో రీచా అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకు ఆల్ అవుట్ అయింది. భారత జట్టులో హర్లిన్ డియోల్ 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. చివర్లో రీచా 20 బంతుల్లో 35 పరుగులు చేసి సునామి తరహాలో ఇన్నింగ్స్ ఆడింది.
టీమిండియా విధించిన 248 పరుగుల లక్ష్యాన్ని చేదించడంలో పాకిస్తాన్ జట్టు ప్రారంభం నుంచి తడబడింది. కీలకమైన ప్లేయర్లు చేతులెత్తేయడంతో పాకిస్తాన్ జట్టు 43 ఓవర్లలో 159 పరుగులకు కుప్ప కూలింది. తద్వారా టీమిండియా 88 పరుగుల తేడాతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. పాకిస్తాన్ జట్టులో సిద్ధ అమీన్ 81 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. క్రాంతి గౌడ్, దీప్తి శర్మ చెరి మూడు వికెట్లు సాధించి.. పాకిస్తాన్ పతనాన్ని శాసించారు. పాకిస్తాన్ జట్టు పై మహిళలపై వరల్డ్ కప్ లో టీమిండియా 11 మ్యాచ్లు ఆడి.. అన్నింట్లోనూ విజయాలు సాధించింది. తాజా మ్యాచ్ ద్వారా టీం ఇండియా సాధించిన విజయాల సంఖ్య 12 కు చేరుకుంది. ఇన్ని మ్యాచ్లలో కూడా పాకిస్తాన్ జట్టు భారత జట్టుకు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పుడు అదే సంప్రదాయం కొలంబోలో కూడా పునరావృతమైంది.
ఈ గెలుపు ద్వారా టీమిండియా పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ స్థానంలోకి చేరుకుంది. ఆస్ట్రేలియాను అధిగమించి సరికొత్త రికార్డు సృష్టించింది. భారత జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు ఉన్నాయి. నెట్ రన్ రేట్(+1.505) కూడా అత్యంత మెరుగ్గా ఉంది. దీంతో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ సాధించే కలకు మరింత దగ్గర అయింది. టీమిండియా ఇదే జోరు కొనసాగిస్తే వన్డే వరల్డ్ కప్ సాధిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఇటీవల జరిగిన ఆసియా కప్ లో టీమిండియా పాకిస్తాన్ జట్టును మూడు మ్యాచ్లలో ఓడించింది. లీగ్, సూపర్ 4, ఫైనల్ మ్యాచ్లలో ఓడించి ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు భారత మహిళల జట్టు కూడా పురుష జట్టు దారిని అనుసరించింది. సరికొత్త చరిత్రను సృష్టించింది.