Brian Lara Funny Request Yashasvi Jaiswal: టీమ్ ఇండియా టెస్ట్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు యువ ఆటగాడు యశస్వి జైస్వాల్. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో అతడు డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ 175 పరుగుల వద్ద అతడు అనూహ్యంగా రన్ అవుట్ అయ్యాడు. ఒకవేళ అతడి గనుక అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే కచ్చితంగా డబల్, త్రిబుల్ సెంచరీ చేసేవాడు. అవకాశం ఉంటే క్వాడ్రపుల్ సెంచరీ దిశగా అడుగులు వేసేవాడు. వాస్తవానికి జైస్వాల్ ఆడిన ఆట మామూలుగా లేదు. అతడు మైదానంలో ఉన్నంతవరకు టీమిండియా స్కోర్ బోర్డ్ రాకెట్ వేగంతో పరుగులు పెట్టింది.
258 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 22 బౌండరీల సహాయంతో 175 పరుగులు చేశాడు. అతడు అదే స్థాయిలో దూకుడు గనక కొనసాగించి ఉంటూ ఉంటే డబుల్ సెంచరీ చేసేవాడు. కానీ ఊహించని విధంగా రన్ అవుట్ కావడంతో డబుల్ సెంచరీ ఆశలు నీరుగారిపోయాయి. దీంతో అతడు నిరాశతో మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. అతడు రన్ అవుట్ కావడానికి గిల్ ప్రధాన కారణమని సోషల్ మీడియాలో విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో యశస్వి జైస్వాల్ కు మద్దతుగా అనేకమంది నిలిచారు. ముఖ్యంగా నెటిజన్లు గిల్ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఆటతీరుతో నాయకుడివి ఎలా అవుతావు అంటూ మండిపడ్డారు.
జైస్వాల్ మైదానం నుంచి వీడి వచ్చిన తర్వాత ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. వెస్టిండీస్ లెజెండ్ ఆటగాడు లారా జెస్వాల్ ను కలిశాడు. అతడికి శుభాకాంక్షలు తెలియజేశాడు. గొప్పగా ఆడుతున్నామంటూ ప్రశంసించాడు. ఇలాంటి దూకుడును ఇంకా చాలా రోజుల పాటు కొనసాగించాలని ఆకాంక్షించాడు. ఇదే సమయంలో అతడు ఒక విన్నపాన్ని కూడా జైస్వాల్ ముందు ఉంచాడు. ” మా బౌలర్ల పై ఆ స్థాయిలో ప్రతాపాన్ని చూపించకు. మా వాళ్ళు తట్టుకోలేరు. ఆ స్థాయిలో నువ్వు బంతిని కొడుతుంటే మా వాళ్ళు చూస్తూ ఉండిపోతున్నారంటూ” లారా వ్యాఖ్యానించాడు. ” లేదు సార్. నేను ట్రై చేస్తున్నా. నేను నా స్థాయిలో ఆడుతున్నాను . కొన్నిసార్లు తప్పిదాలు కూడా జరుగుతున్నాయి. మీ వాళ్ళు బౌలింగ్ బాగానే వేస్తున్నారు. అందులో అనుమానం లేదు. కాకపోతే నా స్థాయిలో నేను నాచురల్ బ్యాటింగ్ చేస్తున్నానని” జైస్వాల్ పేర్కొన్నాడు.
జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. 2024లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 214* పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. అదే ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 209 పరుగులు చేశాడు. 2023 లో వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 171 పరుగులు చేశాడు. 2024 లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 164 పరుగులు చేశాడు. ఇక ఈ ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 118, 101 పరుగులు చేశాడు. ప్రస్తుతం వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న మ్యాచ్లో 126* పరుగులు చేసి అదరగొట్టాడు.