IND vs SL: టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీ -20 ఫార్మాట్ కు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడ్కోలు పలికాడు. దీంతో అతడి స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్ తో టీమ్ ఇండియా మేనేజ్మెంట్ భర్తీ చేసింది. సూర్య కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీలంకతో తలపడిన టీమిండియా 3 టి20 మ్యాచ్ ల సిరీస్ ను 3-0 తో గెలుచుకుంది. ఆ తర్వాత వన్డే సిరీస్ మొదలైంది. మూడు మ్యాచ్ ల ఈ సిరీస్ శుక్రవారం కొలంబో వేదికగా ఆరంభమైంది. టీమ్ ఇండియాకు రోహిత్ శర్మ నాయకత్వం వహించాడు.. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 230 రన్స్ చేసింది. శ్రీలంక విధించిన 231 టార్గెట్ తో టీమిండియా రంగంలోకి దిగింది. ఈ క్రమంలో భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు.
అలా అయినప్పటికీ
పిచ్ పూర్తిస్థాయిలో మందకొడిగా ఉన్నప్పటికీ రోహిత్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. మైదానం తో సంబంధం లేకుండా శివాలెత్తిపోయాడు. మైదానంలో ఉన్నంతసేపు ఫోర్లు, సిక్స్ లతో తాండవం చేశాడు. కేవలం 33 బంతుల్లోనే 50 కొట్టాడు. మొత్తంగా 47 బంతులు ఎదుర్కొని 58 రన్స్ చేశాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు, మూడు సిక్స్ లు ఉన్నాయంటే అతడి బ్యాటింగ్ ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇదే సమయంలో అనేక ప్రపంచ రికార్డులను రోహిత్ శర్మ నెలకొల్పాడు. అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధికంగా సిక్స్ లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డు అంతకుముందు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మోర్గాన్ పేరు మీద ఉండేది. మోర్గాన్ ఇంగ్లాండ్ కెప్టెన్ గా 180 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 233 సిక్స్ లు ఉన్నాయి. అయితే ఈ రికార్డును రోహిత్ 134 ఇన్నింగ్స్ ల్లోనే బ్రేక్ చేయడం విశేషం. ఇదే కాకుండా మరో రెండు ఘనతలను కూడా రోహిత్ అందుకున్నాడు.
15వేల పరుగుల మార్క్
అత్యధిక సిక్సర్లు కొట్టిన కెప్టెన్ గా రికార్డు సృష్టించిన రోహిత్.. మరో అరుదైన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.. ఓపెనర్ గా 15వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 15 వేల పరుగుల మైలురాయిని అందుకున్న రెండవ ఓపెనర్ గా రోహిత్ రికార్డు సృష్టించాడు. టీమిండియా బ్యాటింగ్ దిగజం సచిన్ టెండూల్కర్ 331 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించగా.. రోహిత్ శర్మ 352 ఇన్నింగ్స్ లలో ఈ ఘనతను సాధించాడు. ఇక వన్డే క్రికెట్ ఇంటర్నేషనల్ లో 10 ఓవర్ల లోపే అత్యధికంగా హాఫ్ సెంచరీలు సాధించిన రెండవ భారత బ్యాటర్ గా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే ముందు ఏడు అర్థ సెంచరీలతో వీరేంద్ర సెహ్వాగ్ తొలి స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ మూడు అర్థ సెంచరీలతో రెండవ స్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్ ఒక అర్థ శతకంతో మూడో స్థానంలో ఉన్నాడు. రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ చేరో అర్థ సెంచరీ తో నాలుగు, ఐదు స్థానాలలో నిలిచారు