IND Vs SA T20: గెలుపు దాకా వచ్చారు.. చివర్లో తలవంచారు.. టీమిండియా ఓటమికి కారణం వారిద్దరే..

ఉత్కంఠ భరితంగా సాగిన రెండవ టి20 లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓడిపోయింది. దీంతో రెండు జట్లు నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్లో 1-1 తో సమంగా నిలిచాయి. ఈ మ్యాచ్ లో భారత్ గెలవాల్సి ఉండగా.. చివర్లో చేతులెత్తేసింది.

Written By: Anabothula Bhaskar, Updated On : November 11, 2024 8:22 am

IND Vs SA T20(1)

Follow us on

IND Vs SA T20: టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి తన కెరియర్ లోనే అద్భుతమైన గణాంకాలు నమోదు చేశాడు. 17 పరుగులకే ఐదు వికెట్లను పడగొట్టి సత్తా చాటాడు. కానీ మిగతా బౌలర్లు ఆ లయను అందుకోవడంలో విఫలమయ్యారు. దీంతో ఆతిధ్య జట్టు విజయం సాధించింది. ఒకానొక దశలో 86/7 వద్ద ఓటమి వైపు దక్షిణాఫ్రికా జట్టు సాగింది. కానీ ఈ దశలో స్టబ్స్(47*) సూపర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. అతడు ధైర్యంగా నిలబడి ఆడటంతో మ్యాచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. కొట్జి(19*) కూడా స్టబ్స్ కు సహకారం అందించాడు. వీరిద్దరూ 40 పరుగులు చేసి దక్షిణాఫ్రికా జట్టుకు గెలుపును అందించారు. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా జట్టు సంచలనం సృష్టించింది. భారత జట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.. జింబాబ్వే సిరీస్ నుంచి మొదలు పెడితే భారత జట్టు వరుసగా 11 టి20 మ్యాచ్ లలో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది… దానికి దక్షిణాఫ్రికా బ్రేక్ వేసింది. ఈ మ్యాచ్లో ముందుగా భారత జట్టు బ్యాటింగ్ చేసింది. ఏడు వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. హార్దిక్ 39*, అక్షర్ 27, తిలక్ 20 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. మిగతా టాప్ ఆర్డర్ మొత్తం విఫలమైంది.

వరుణ్ అదరగొట్టాడు

టార్గెట్ స్వల్పం అయినప్పటికీ.. వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికా జట్టుకు చుక్కలు చూపించాడు. ఒకానొక దశలో బంతుల కంటే సాధించాల్సిన పరుగులు ఎక్కువయ్యాయి. దీంతో భారత్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కాని చివర్లో పేస్ బౌలర్లు ఆవేశ్ ఖాన్, అర్ష్ దీప్ సింగ్ చేతులెత్తేశారు. లయను కోల్పోయి బౌలింగ్ వేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్ల పండగ చేసుకున్నారు.. వాస్తవానికి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ప్రారంభమైన సమయంలో మూడో ఓవర్లోనే అర్ష్ దీప్ సింగ్ ప్రమాదకరమైన ఓపెనర్ రికెల్టన్ (13) ను అవుట్ చేసాడు. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి దక్షిణాఫ్రికా జట్టుకు కోలుకోలేని షాక్ లు ఇవ్వడం మొదలుపెట్టాడు. కెప్టెన్ మార్క్రమ్(3), ఓపెనర్ హెన్డ్రిక్స్, జాన్సన్ (7) ను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక 13వ ఓవర్ లో క్లాసెన్(2), మిల్లర్(0) ను పెవిలియన్ చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా 66 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. విజయంపై కూడా ఆశలను వదిలేసుకుంది. ఈ దశలో సిమెలానే(7) ఔట్ అయ్యాడు. అయితే స్టబ్స్ కు కొట్జి జత అయ్యాడు. స్టబ్స్ 17 ఓవర్లో కొట్టిన భారీ సిక్స్ చేయడం అవతల పడింది.. దీంతో ఆ ఓవర్లో దక్షిణాఫ్రికా గట్టుకు 12 పరుగులు వచ్చాయి. ఇక 18 ఓవర్లో స్టబ్స్ రెండు ఫోర్లు కొట్టి గెలుపు సమీకరణాన్ని 12 బాంతుల్లో 13 పరుగులతో చేర్చాడు. అయితే 19 ఓవర్లో స్టబ్స్ 4 ఫోర్లు కొట్టి 16 పరుగులు చేశాడు. విజయవంతంగా మ్యాచ్ ను ముగించాడు.