Smriti Mandhana: మిథాలీ రాజ్ రికార్డు సమం.. స్మృతి మందాన మరో సంచలనం

తొలి వన్డేలో సౌత్ ఆఫ్రికా జట్టుపై సెంచరీ సాధించిన స్మృతి.. బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక నాదం చేసింది. రెండు వరుస వన్డే మ్యాచ్ లలో.. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి సరికొత్త ఘనతను లిఖించుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 19, 2024 10:21 pm

Smriti Mandhana

Follow us on

Smriti Mandhana: ఉమెన్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టును విజేతగా నిలిపిన స్మృతి మందాన.. జాతీయ జట్టులోనూ అదే జోరు కొనసాగిస్తోంది. దేశంలో దక్షిణాఫ్రికా తో జరుగుతున్న వన్డే సిరీస్లో అదరగొడుతోంది. తొలి వన్డేలో సౌత్ ఆఫ్రికా జట్టుపై సెంచరీ సాధించిన స్మృతి.. బెంగళూరు వేదికగా జరుగుతున్న రెండో వన్డేలోనూ శతక నాదం చేసింది. రెండు వరుస వన్డే మ్యాచ్ లలో.. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు చేసి సరికొత్త ఘనతను లిఖించుకుంది. భారతీయ మహిళా జట్టు మాజీ కెప్టెన్ మిథాలి రాజ్ రికార్డు సమం చేసింది.. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టుపై 117 పరుగులు చేసింది. బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్లో 103 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకుంది.

ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు.. భారత జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది. అసలే బ్యాటింగ్ కు అనుకూలిస్తున్న మైదానంపై స్మృతి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. దక్షిణాఫ్రికా బౌలర్ల బౌలింగ్ ను తుత్తునీయలు చేసింది. 103 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో శతకం పూర్తి చేసుకుంది. ఈ సెంచరీ తో వన్డేలలో ఏడు శతకాలు పూర్తి చేసుకున్న క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది.. భారతీయ మహిళా జట్టులో అత్యధిక సెంచరీలు సాధించిన మిథాలీ రాజ్ సరసన స్మృతి మందాన చేరింది.. సఫాలీ వర్మ(20; 38 బంతుల్లో మూడు ఫోర్లు) తో భారత ఇన్నింగ్స్ మొదలుపెట్టిన స్మృతి మందాన.. దక్షిణాఫ్రికా బౌలర్లపై ప్రారంభం నుంచి ఎదురుదాడికి దిగింది. సఫాలీ వర్మ 20 పరుగులకు మ్లాబా బౌలింగ్లో ఔట్ అయింది. ఆ తర్వాత వచ్చిన దయాళన్ హేమలత (24: 41 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్లు) 24 పరుగులు చేసి మసాబాటా క్లాన్ బౌలింగ్లో క్యాచ్ అవుట్ అయింది. ఆ తర్వాత హర్మన్ ప్రీత్ కౌర్ క్రీజ్ లోకి వచ్చింది. అగ్నికి వాయువు తోడైనట్టు.. స్మృతికి హర్మన్ జతవ్వడంతో భారత జట్టు స్టోర్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. వీరిద్దరూ కలిసి మూడో వికెట్ కు 171 రన్స్ పార్ట్నర్ షిప్ నెలకొల్పారు. స్మృతి మందాన 120 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లతో 136 పరుగులు చేసింది. కెప్టెన్ కౌర్ 88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి, అజేయంగా నిలిచింది. 150 పరుగులు చేస్తుందనుకున్న స్మృతి 136 పరుగుల వద్ద మ్లాబా బౌలింగ్లో ఔట్ అయింది. స్మృతి అవుట్ అయిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన రీచా ఘోష్ 13 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్ సహాయంతో 25 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మ్లాబా రెండు వికెట్లు పడగొట్టింది. క్లాస్ ఒక వికెట్ దక్కించుకుంది.

2016-17 సీజన్ లో న్యూజిలాండ్ క్రీడాకారిణి అమీ సాటర్త్ వైట్ వరుసగా నాలుగు సెంచరీలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక వన్డేల్లో ఆల్ టైమ్ రన్స్ చేసిన క్రీడా కారిణుల్లో స్మృతి మొన్నటి దాకా ఆరవ స్థానంలో కొనసాగేది. దక్షిణాఫ్రికాతో వరుసగా సెంచరీలు చేయడం ద్వారా ఐదో స్థానానికి చేరుకుంది. మహిళా ఓపెనర్లలో న్యూజిలాండ్ క్రీడాకారిణి సుజీ బేట్స్ 12 సెంచరీలతో మొదటి స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ క్రీడాకారిణి బ్యూ మాంట్ 9 సెంచరీలు, ఇంగ్లాండ్ క్రీడాకారిణి ఎడ్వర్డ్స్ 9, శ్రీలంక క్రీడాకారిణి అతపత్తు 9, భారత జట్టు క్రీడాకారిణి స్మృతి మందాన 7, దక్షిణాఫ్రికా క్రీడాకారిణి వోల్ వార్డ్స్ 7, వెస్టిండీస్ క్రీడాకారిణి హెలీ 6 సెంచరీలతో తర్వాతి స్థానాలలో కొనసాగుతున్నారు. ఇక టీమిండియా తరఫున స్మృతీ 7, మిథాలీ 7, హర్మన్ ప్రీత్ కౌర్ 5, పూనమ్ రౌత్ 3 సెంచరీలు చేశారు.