IND Vs SA: గుహవాటి.. టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టెస్టు.. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. గిల్ గాయపడిన నేపథ్యంలో అతడి స్థానాన్ని మేనేజ్మెంట్ పంత్ తో భర్తీ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. రెడ్ పిచ్ కావడంతో అటు బౌలర్లకు, బ్యాటర్లకు తొలి రోజు సమ ప్రాధాన్యం లభించింది.
రెడ్ పిచ్ పై వికెట్లు పడగొట్టడంలో టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. తొలి వికెట్ కు దక్షిణాఫ్రికా ఓపెనర్లు 82 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత మూడో వికెట్ కు కూడా దక్షిణాఫ్రికా కెప్టెన్, స్టబ్స్ 84 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత టీమ్ ఇండియా బౌలర్లు పట్టు బిగించడంతో దక్షిణాఫ్రికా బ్యాటర్లు వెంట వెంటనే ఔటయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా తొలిరోజు ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
వాస్తవానికి టీమిండియా కు వికెట్ కావలసిన ప్రతి సందర్భంలోనూ కెప్టెన్ పంత్ మైదానంలో సందడి చేశాడు. బౌలర్లను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశాడు. బ్యాటర్ల లోటుపాట్లను గమనించి ఎప్పటికప్పుడు బౌలర్లకు చేరవేశాడు. దక్షిణాఫ్రికా ప్లేయర్లకు హిందీ రాకపోవడంతో.. పంత్ హిందీలోనే తోటి ప్లేయర్లతో సంభాషించాడు. తద్వారా మైదానంలో వాగుడుకాయ లాగా పొద్దంతా వాగాడు. వాస్తవానికి గిల్ తోటి ప్లేయర్లతో ఇలా సంభాషించడు. అరుదుగా మాత్రమే మాట్లాడుతుంటాడు. అయితే అందుకు విరుద్ధంగా పంత్ తోటి ప్లేయర్లతో మాట్లాడటం మొదలుపెట్టాడు.
వాస్తవానికి మైదానంలో మాట్లాడిన మాటలు కామెంట్రీ బాక్స్ దాకా వినిపించాయి. లైవ్ మ్యాచ్ చూస్తున్న వారికి కూడా పంత్ మాటలు అత్యంత స్పష్టంగా వినిపించాయి. పంత్ అలా మాట్లాడుతున్న నేపథ్యంలో నెటిజన్లు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. గిల్ స్థానానికి పంత్ ఎసరు పెట్టాడని.. అందువల్ల ఇలా మాట్లాడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు.
రిషబ్ పంత్ ఇటీవల ఇంగ్లాండ్ సిరీస్లో గాయపడ్డాడు.. దీంతో చాలా రోజులపాటు ఆసుపత్రికి పరిమితమయ్యాడు. ఆ తర్వాత రికవరీ అయ్యాడు. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన అనధికారిక టెస్టు సిరీస్లో గాయపడ్డాడు. అయితే ఆ గాయాలు స్వల్పంగా తగలడంతో పంత్ తుది జట్టులో స్థానం దక్కించుకున్నాడు. చివరికి రెండో టెస్టుకు భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.