Ind Vs SA 3rd T20: నాలుగు టి20 మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత జట్టు ప్రస్తుతం సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా తో మూడవ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో భాగంగా టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు బౌలింగ్ వైపు మొగ్గు చూపించింది. దీంతో భారత జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే పరుగుల ఖాతా ప్రారంభించకుండానే టీమిండియా సంజు శాంసన్ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది . రెండు బంతులు ఎదుర్కున్న అతడు జాన్సన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజ్ లోకి తిలక్ వర్మ వచ్చాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (50) తో కలిసి జట్టు ఇన్నింగ్స్ భారాన్ని భుజాలకు ఎత్తుకున్నాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ కలిసి రెండో వికెట్ కు 107 పరుగులు జోడించారు. వీరిద్దరి జోరుకు టీమిండియా 8.4 ఓవర్లలోనే ఆ పరుగులు చేయడం విశేషం. హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో
ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ (1) నిరాశపరిచాడు.. రింకూ సింగ్(8) కూడా మరోసారి విఫలమయ్యాడు. తోటి ఆటగాళ్ల నుంచి సరైన తోడ్పాటు లభించకపోయినప్పటికీ తిలక్ వర్మ ఆకాశమేహద్దుగా చెలరేగాడు. 56 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 107 పరుగులు చేశాడు. అతడి దూకుడైన ఇన్నింగ్స్ ఫలితంగా టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
అదరగొట్టాడు
వాస్తవానికి ఈ సిరీస్ తొలి మ్యాచ్లో తిలక్ వర్మ 33 పరుగులు చేశాడు. రెండో మ్యాచ్ లోనూ 20 పరుగులు చేశాడు. అయితే తొలి మ్యాచ్ టీమ్ ఇండియా గెలిచింది. రెండో మ్యాచ్ ఓడిపోయింది. ఫలితంగా మూడో మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. ఈ దశలో ఓపెనర్ సంజు వికెట్ ను టీమిండియా త్వరగానే కోల్పోయింది. దీంతో తిలక్ వర్మ స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా మైదానంపై తెలుగువాడి సత్తాను చూపించాడు. సౌత్ ఆఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగుతూ.. టీమ్ ఇండియా స్కోర్ ను పరుగులు పెట్టించాడు.. సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా లాంటి ఆటగాళ్లు విఫలమైనచోట.. అతడు మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. వీరోచితమైన బ్యాటింగ్ తో మైదానంలో పరుగుల సునామీ సృష్టించాడు. దీంతో ఈ సిరీస్ లో భారత్ రెండోసారి 200 పరుగుల మైలురాయిని చేరుకుంది. తొలి మ్యాచ్లో సంజు సెంచరీ చేయడంతో టీమిండియా 200 + స్కోర్ చేసిన సంగతి తెలిసిందే.