IND vs SA: టెస్ట్ సిరీస్ వైట్ వాష్ కు గురైన తర్వాత.. టీమిండియా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది.. రెండో వన్డేలో కూడా 350 కి మించి పరుగులు చేసింది. అయినప్పటికీ బౌలింగ్ సరిగ్గా లేకపోవడంతో ఓటమిపాలైంది. దీంతో ఈ సిరీస్ విజేతను నిర్ణయించే చివరి మ్యాచ్ శనివారం విశాఖపట్నంలో జరగనుంది.
తొలి రెండు వన్డేలలో రెండు జట్లు భారీగా పరుగులు చేశాయి. శనివారం విశాఖపట్నంలో జరిగే మ్యాచ్లో కూడా భారీగా స్కోర్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఇప్పటికీ వరుసగా 20 మ్యాచ్లలో టీమిండియా టాస్ ఓడిపోయింది. ఈ మ్యాచ్లో అయినా టాస్ గెలవాలని.. బౌలింగ్ ఎంచుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. ఎందుకంటే చేజింగ్ సమయంలో డ్యూ ఎక్కువగా ఉంటుందని.. అలాంటప్పుడు టీమిండియా టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్టేనని అభిమానులు అంచనా వేస్తున్నారు.
భారత జట్టు బ్యాటింగ్ బాగున్నప్పటికీ బౌలింగ్ విషయంలోనే తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ముఖ్యంగా కులదీప్ యాదవ్, ప్రసిద్ కృష్ణ దారుణంగా పరుగులు ఇస్తున్నారు.. హర్షిత్ రాణా కూడా బౌలింగ్లో ఆకట్టుకోలేకపోతున్నాడు. బ్యాటర్లలో జైస్వాల్ నుంచి మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. రాహుల్, విరాట్, రోహిత్ వీర లెవెల్లో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి రెండు వన్డేలలో వీరు ముగ్గురు మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ వరుసగా సెంచరీలు చేశాడు. విరాట్ కోహ్లీకి విశాఖపట్నం మైదానంలో తిరుగులేని రికార్డు ఉంది. శనివారం జరిగే మ్యాచ్లో కూడా అతడు దుమ్మురేపుతాడని అభిమానులు అంచనా వేస్తున్నారు.
విశాఖపట్నం మైదానం స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తుందని క్యూరేటర్ చెబుతున్నారు. ఈ ప్రకారం కులదీప్, జడేజా, సుందర్ ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాల్సి ఉంది. భీకరమైన బ్యాటింగ్ లైన్ అప్ ఉన్న దక్షిణాఫ్రికా ను భారత బౌలర్లు పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.
తొలి వన్డేలో పోరాడిన దక్షిణాఫ్రికా .. ఆ స్పూర్తిని రెండో వన్డేలో కొనసాగించింది. ఇప్పటికే ఆ జట్టు టెస్ట్ సిరీస్ సొంతం చేసుకుంది. వన్డే సిరీస్ కూడా దక్కించుకోవాలని భావిస్తోంది. తద్వారా ఈ సిరీస్ ను ఉత్తమమైనదిగా మార్చుకోవాలని అనుకుంటున్నది. బ్యాటింగ్లో మార్కం జోరు చూపిస్తున్నాడు. యాన్సన్ అదరగొడుతున్నాడు. బ్రేవిస్ సత్తా చూపిస్తున్నాడు. బ్రిజ్కే కీలకమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. దక్షిణాఫ్రికాలో బౌలింగ్ అంత గొప్పగా లేకపోయినప్పటికీ.. బ్యాటింగ్లో మాత్రం దుమ్మురేపుతున్నారు. మరోవైపు బర్గర్ గాయపడిన నేపథ్యంలో.. బార్ట్ మన్ కు తుది జట్టులో చోటు దక్కుతుంది. విశాఖపట్నం మైదానం స్పిన్ కు సహకరిస్తుంది కాబట్టి కేశవ్ మహారాజ్ సత్తా చూపిస్తాడని దక్షిణాఫ్రికా జట్టు నమ్ముతోంది.