IND Vs SA: కోల్ కతా ఓటమి తర్వాత టీమిండియా గుహవాటి వేదికగా సౌత్ ఆఫ్రికా జట్టుతో రెండవ టెస్ట్ మొదలుపెట్టింది. శనివారం మొదలైన ఈ మ్యాచ్లో పర్యాటక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ లో తొలి రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆరు వికెట్లు కోల్పోయింది. 247 పరుగులు చేసింది. స్టబ్స్(49) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్లు మార్కరం (38), రికెల్టన్ (35) పర్వాలేదు అనిపించారు. కెప్టెన్ బవుమా(41) మరోసారి స్ఫూర్తిదాయకమైన ఇన్నింగ్స్ ఆడాడు.. జోర్జి (28) తన వంతు సహకారం అందించాడు. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టు గౌరవప్రదమైన స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది.
రెడ్ పిచ్ కావడం.. పైగా గడ్డిని కత్తిరించడంతో టీమ్ ఇండియా ప్లేయర్లు ముఖ్యంగా బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా బౌలర్లు ఆ స్థాయిలో రెచ్చిపోలేదు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా ఓపెనర్లు చాలా సహనంతో ఆడారు. తొలి వికెట్ కు 82 పరుగులు జోడించారు. మార్క్రం, రికెల్టన్ జోడిని బుమ్రా విడదీశాడు. మార్క్రమ్ అవుట్ అయిన తర్వాత.. వెంటనే రికెల్టన్ కూడా అవుట్ అయ్యాడు. ఈ దశలో కెప్టెన్ బవుమా, స్టబ్స్ మూడో వికెట్ కు 84 పరుగులు జోడించారు. వీరిద్దరూ ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో రవీంద్ర జడేజా సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ను వెనక్కి పంపించాడు. ఆ తర్వాత స్టబ్స్ ను కులదీప్ యాదవ్ అవుట్ చేశాడు. అప్పటికి దక్షిణాఫ్రికా స్కోర్ 187 పరుగులు.. ఇక ఆ తర్వాత దక్షిణాఫ్రికా క్రమంగా వికెట్లను కోల్పోయింది. ముల్డర్ (13) పెద్దగా ప్రభావం చూపించలేదు.
ఈ పిచ్ టీమ్ ఇండియా బౌలర్లకు పెద్ద గుణపాఠమే నేర్పింది. ఎందుకంటే తొలి 10 ఓవర్లలో బంతి వేగంగా స్వింగ్ అయింది. ఆ తర్వాత బంతి మీద గ్రిప్ సాధించడానికి బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బుమ్రా, కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా పర్వాలేదు అనిపించారు. కులదీప్ 3 వికెట్ల తన ఖాతాలో వేసుకున్నాడు. మిగతా బౌలర్లు తల ఒక వికెట్ దక్కించుకున్నారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి అంతగా ప్రభావం చూపించలేకపోయాడు. రెండవ రోజు టీ విరామానికి ముందు భారత బౌలర్లు గనుక సత్తా చూపిస్తే దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. ప్రస్తుతం క్రీజ్ లో సేనురాను ముత్తుస్వామి (25), వెర్రి (1) ఉన్నారు. ఈ జోడి ప్రమాదకరంగా మారకముందే టీమ్ ఇండియా బౌలర్లు మేలుకోవాలి. ముఖ్యంగా పేస్ బౌలర్లు సత్తా చూపించాలి. సిరాజ్ కట్టుదిట్టంగా బంతులు వేస్తే దక్షిణాఫ్రికా వణికిపోవడం ఖాయం. ఎందుకంటే బుమ్రా కు బలమైన సహకారం సిరాజ్ నుంచి లభిస్తే భారత జట్టుకు తిరుగు ఉండదు.
….
Another superb grab helped #TeamIndia end the day on a positive note!
c @RishabhPant17 b @mdsirajofficial
Scorecard ▶️ https://t.co/Hu11cnrocG#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/fo0UpawXhi
— BCCI (@BCCI) November 22, 2025