IND Vs SA: చండీగఢ్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్ నిర్ణయం తప్పని దక్షిణాఫ్రికా ఆటగాళ్లు నిరూపించారు. ముఖ్యంగా డికాక్ 46 బంతుల్లో 90 పరుగులు చేసి టీమ్ ఇండియా బౌలింగ్ మొత్తాన్ని ఊచకోత కోశాడు. చివర్లో ఫెరీర 16 బంతులలో ముప్పై పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. ఫలితంగా నాలుగు వికెట్ల నష్టానికి పర్యాటక దక్షిణాఫ్రికా జట్టు 213 పరుగులు చేసింది.
214 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన టీం ఇండియా ఏ దశలో కూడా విజయం సాధించే దిశగా అడుగులు వేయలేదు. ఓపెనర్లు విఫలమయ్యారు అభిషేక్ శర్మ 17 పరుగులు చేసి సత్తా చూపించినప్పటికీ చివరి వరకు నిలబడలేకపోయాడు.. గిల్ 0 పరుగులకే అవుట్ అయ్యాడు. సూర్య కుమార్ యాదవ్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. అక్షర్ పటేల్ 21 పరుగులు చేసినప్పటికీ, అదే స్థాయిలో బంతులను స్వీకరించాడు. హార్దిక్ పాండ్యా తొలి మ్యాచ్ మాదిరిగా అదరగొట్టలేకపోయాడు. జితేష్ శర్మ ఉన్నంతలో పర్వాలేదనిపించాడు.. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 34 బంతుల్లో 62 పరుగులు చేసి అదరగొట్టాడు. మిగతా బ్యాటర్ల నుంచి అతనికి సహకారం లభించకపోవడంతో టీమిండియా 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
దక్షిణాఫ్రికా విధించిన లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. ముఖ్యంగా చివరి ఐదు వికెట్లను టీమిండియా కేవలం ఐదు పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం అభిమానులకు ఏమాత్రం ఆనందం కలిగించడం లేదు. 157 పరుగుల వద్ద జితేష్ శర్మ వికెట్ కోల్పోయిన టీమ్ ఇండియా ఆ తర్వాత వరుసగా వికెట్లను నష్టపోయింది. శివం దుబే, అర్ష్ దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, తిలక్ వర్మ ఇలా వరుసగా ఆటగాళ్లు అవుట్ కావడంతో టీమిండియా 19.1 ఓవర్లలోనే ఆల్ అవుట్ అయింది.
వాస్తవానికి ఈ పిచ్ బ్యాటింగ్ కు సహకరిస్తుంది. కానీ అలాంటి మైదానం మీద దక్షిణాఫ్రికా ప్లేయర్లు రెచ్చిపోతే.. టీం ఇండియా ప్లేయర్లు మాత్రం తలవంచారు. లక్ష్యాన్ని చేదించే దిశగా ఏ సందర్భంలో కూడా అడుగులు వేయలేదు. ముఖ్యంగా టీమిండియా తరఫునుంచి తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా మాత్రమే (41 బంతుల్లో 51 పరుగులు) మెరుగైన భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మిగతా ప్లేయర్లు అత్యంత దారుణంగా విఫలమయ్యారు. తొలి వికెట్ కు 9 పరుగుల భాగస్వామ్యం వచ్చిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రెండో వికెట్ కు కేవలం పది పరుగులు, మూడో వికెట్ కు 13 పరుగుల భాగస్వామ్యాలు నమోదయ్యాయంటే టీమిండియా బ్యాటింగ్ ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బార్ట్ మాన్ టీమిండియా పతనాన్ని శాసించాడు. అతడు నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు.