IND Vs SA: 3 వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియా రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్లో గెలిచింది. ఏకంగా 349 పరుగులు చేసి.. తమ బ్యాటింగ్ సత్తా ఏమిటో దక్షిణాఫ్రికా బౌలర్లకు చూపించింది. ఇదే జోరు రెండవ వన్డేలో కూడా ప్రదర్శించాలని టీమిండియా భావిస్తోంది.
Also Read: ఈ లోపాలు అధిగమిస్తేనే.. “రాయ్ పూర్” సొంతమయ్యేది!
తొలి వన్డేలో విరాట్ సెంచరీ చేశాడు, రోహిత్, కేఎల్ రాహుల్ అర్థ సెంచరీలతో అదరగొట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం రాయిపూర్ వేదికగా జరిగే రెండవ వన్డేలో వీరి ముగ్గురిపై భారీ అంచనాలు ఉన్నాయి.. వీరు ముగ్గురు గనుక అదరగొడితే టీమిండియాకు తిరుగు ఉండదు.. మరోవైపు తొలి వన్డేలో గైక్వాడ్ విఫలమయ్యాడు. బ్యాటింగ్ చేయడంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ నేపథ్యంలో రెండవ వన్డేకు అవకాశం ఇస్తారా? అనే ప్రశ్న అందరిలోనూ వ్యక్తమౌతోంది.
బీభత్సంగా బ్యాటింగ్ చేసే పంత్ ను సైతం రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి అవకాశం కల్పిస్తే గైక్వాడ్ దానిని వినియోగించుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిని రెండవ వన్డేలో రిజర్వ్ బెంచ్ కు పరిమితం చేసి, రిషబ్ పంత్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. కొన్ని జాతీయ మీడియా సంస్థలు కూడా ఈ దిశగా వార్తలను ప్రసారం చేశాయి. అయితే దీనిపై మేనేజ్మెంట్ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు..
ఒకవేళ తొలి వన్డేలో విఫలమైన గైక్వాడ్ ను పక్కన పెడితే తప్పుడు సంకేతాలు వెళ్తాయని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్ని స్పోర్ట్స్ వెబ్సైట్లు కూడా ఇదే దిశగా కథనాలను పబ్లిష్ చేశాయి. ఈ ప్రకారం గైక్వాడ్ కు రెండో వన్డేలో చోటు లభిస్తుందని తెలుస్తోంది. ఒకవేళ రెండో వన్డేలో కూడా అతడు విఫలమైతే.. పంత్ కు మూడో వన్డేలో చోటు లభిస్తుందని సమాచారం.
పంత్ కు ఫామ్ తో సంబంధం ఉండదు. అతడిదైన రోజు నిలువరించడం సాధ్యం కాదు. ఎంతటి బౌలర్ల అయినా సరే అతని ముందు తలవంచాల్సిందే. ఫార్మేట్ తో సంబంధం లేకుండా వేగంగా పరుగులు చేయడం అతడి నైజం. అతడు జట్టులోకి వస్తే బలం పెరుగుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవలి టెస్ట్ సిరీస్ లో అతడు విఫలమైనప్పటికీ మేనేజ్మెంట్.. భారీగానే అంచనాలు పెట్టుకుంది.