IND vs NZ : భారత గడ్డపై న్యూజిలాండ్ సిరీస్ గెలిచింది అనేకంటే.. భారత్ చేజేతులా ఓటమిని కొని తెచ్చుకుంది అనడం సబబు. ఎందుకంటే బెంగళూరు మైదానాన్ని పేస్ వికెట్ కు అనుకూలంగా మార్చింది. ఆ ప్రణాళిక ఎదురు తన్నింది. పూణే మైదానాన్ని స్పిన్ వికెట్ గా రూపాంతరం చెందించింది. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. మొత్తంగా భారత మేనేజ్మెంట్ ఎటువంటి ప్రణాళిక అయితే రూపొందించిందో.. అది ముమ్మాటికి బెడిసికొట్టింది. స్థూలంగా ఎవరు తీసుకున్న గోతిలో వారు పడతారు అనే సామెత వాస్తవంలోకి వచ్చింది. భారత జట్టుకు ఇలాంటి చేదు గుళికలు ఇదే తొలిసారి కాదు. 2023లో ఇండోర్ మైదానంలో ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన మ్యాచ్ లో భారత్ ఇదే విధంగా ఓడిపోయింది. ఈ ఏడాది జనవరిలో హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన ఓటమిని మూటకట్టుకుంది. 2021 చెన్నైలో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ భారత జట్టుకు వ్యతిరేక ఫలితం వచ్చింది. వాస్తవానికి ఇవన్నీ గుణపాఠాలు. అయితే వీటినుంచి పాఠం నేర్చుకోకపోవడమే అసలైన విధి వైచిత్రి.
తేలిపోయారు
న్యూజిలాండ్ జట్టుతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ లలో భారత ఆటగాళ్లు తేలిపోయారు. 46 పరుగులకే కుప్పకూలిపోయి చెత్త రికార్డు నమోదు చేసుకున్నారు. గెలవాల్సిన చోట వరుసగా పెవీలియన్ చేరుకుని.. పర్యాటక జట్టు చేతిలో పరువు తీసుకున్నారు. యశస్వి జైస్వాల్, సర్పరాజ్ ఖాన్, రిషబ్ పంత్ మినహా మిగతా ఆటగాళ్లంతా న్యూజిలాండ్ బౌలర్ల ఎదుట లొంగిపోయారు. మరీ ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దారుణంగా ఆడుతూ పరువు తీసుకున్నారు.. బౌలర్ల విషయానికొస్తే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ తేలిపోయారు. ఒక్క వాషింగ్టన్ సుందర్ మాత్రమే రాణిస్తున్నాడు. చివరికి గొప్ప గొప్ప ఆటగాళ్లు సైతం సాంట్నర్ లాంటి బౌలర్ చేతిలో అవుట్ కావడం భారత జట్టు దుస్థితిని తెలియజేస్తోంది. న్యూజిలాండ్ జట్టు చేతిలో సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో.. టీమిండియా ఇకపై న్యూజి లాండ్, ఆసీస్ జట్ల పై ఆడే మిగతా ఆరు మ్యాచ్లలో.. నాలుగు గెలవాలి. అప్పుడే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోకి వెళ్తుంది. ఇప్పటివరకు రెండు సీజన్లలో టీమిండియా ఫైనల్ వెళ్ళింది. తొలిసారి న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. రెండోసారి ఆస్ట్రేలియా చేతిలో పరాజయానికి గురైంది. మూడోసారి కూడా ఫైనల్ వెళ్లి.. ఈసారి టెస్ట్ గదను దక్కించుకోవాలని భావిస్తోంది. మరి ఈ సమయంలో రోహిత్ శర్మ నాయకత్వం లో టీమిండియా మిగతా మ్యాచ్ లలో ఎలా ఆడుతుందనేదే ఆసక్తికరంగా మారింది.