IND Vs NZ: 2026 సంవత్సరంలో టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో స్వదేశం వేదికగా వన్డే సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్లో భాగంగా టీమిండియా మూడు వన్డే మ్యాచ్లను న్యూజిలాండ్ జట్టుతో ఆడుతుంది. జనవరి 11 నుంచి 18 వరకు ఈ సిరీస్ నడుస్తుంది. దీనికి సంబంధించి జట్టును సెలెక్టర్లు త్వరలోనే ప్రకటిస్తారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కొన్ని సంస్థలు ప్రసారం చేసిన వార్తలలో రిషబ్ పంత్ మీద వెయిట్ వేస్తారని ప్రచారం జరుగుతోంది. డొమెస్టిక్ క్రికెట్ లో సత్తా చూపిస్తున్న ఇషాన్ కిషన్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది.
2024 లో ఆగస్టు నెలలో రిషబ్ పంత్ శ్రీలంక జట్టుతో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు. ఇటీవల దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన వన్డే సిరీస్ కు పంత్ ఎంపికయ్యాడు. కానీ అతడు తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. పంత్ ఫాం ప్రకారం అతడిని న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ కోసం ఎంపిక చేయకూడదని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.. ఇషాన్ కిషన్ కూడా వన్డే మ్యాచ్లు ఆడి దాదాపు 24 నెలలు గడిచిపోయింది. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కిషన్ తన చివరి మ్యాచ్ ఆడాడు.
కిషన్ దురుసు ప్రవర్తన వల్ల జట్టుకు దూరమయ్యాడు. మేనేజ్మెంట్ అతని మీద కరుణ చూపించకపోవడంతో.. చోటు పొందలేకపోయాడు. మేనేజ్మెంట్ దృష్టిలో పడాలని.. జట్టులో చోటు దక్కించుకోవాలని కిషన్ భావిస్తున్నాడు. అతడు అనుకున్నట్టుగానే ఇప్పుడు దేశవాళి క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో సత్తా చూపిస్తున్నాడు. ఆ టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. దీంతో సెలక్టర్లు అతడిపై దృష్టి సారించారు. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో జార్ఖండ్ జట్టు తొలిసారిగా ట్రోఫీ సాధించింది. జార్ఖండ్ జట్టు ఈ ఘనత సాధించడం వెనక కిషన్ ఉన్నాడు. అందువల్లే అతడిని వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచ కప్ కోసం ఎంపిక చేశారు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో కిషన్ కర్ణాటక జట్టుపై 33 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అతడు సూపర్ ఫామ్ లో ఉన్న నేపథ్యంలో వన్డే జట్టులోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వన్డే జట్టు కెప్టెన్ గిల్ మెడ నొప్పి వల్ల వన్డే సిరీస్ కు దూరమైన విషయం తెలిసిందే. అయితే అతడు న్యూజిలాండ్ సిరీస్ ద్వారా జట్టులోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరోవైపు ఉపసారథి అయ్యర్ విషయంలో ఇంతవరకు క్లారిటీ రావడం లేదు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సులో ప్రస్తుతం అయ్యర్ ఉన్నాడు. ఆస్ట్రేలియా సిరీస్ లో అతడు గాయపడ్డాడు. అతడు లేకుండానే దక్షిణాఫ్రికా తో టీమిండియా టి20, వన్డే సిరీస్ ఆడింది. అయితే న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ కోసం అతడు వస్తాడా? రాడా? అనే విషయాలపై త్వరలోనే క్లారిటీ వస్తుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. న్యూజిలాండ్ జట్టుతో జరిగే సిరీస్ లో జనవరి 11న వడోదర, జనవరి 14న రాజ్ కోట్, జనవరి 18న ఇండోర్ లో మ్యాచ్లు జరుగుతాయి.