IND Vs NZ: క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్ కంటే అత్యంత ముఖ్యమైనది ఫీల్డింగ్.. బ్యాటర్లు ఎంత గొప్పగా బ్యాటింగ్ చేసినా.. బౌలర్లు ఎంత అద్భుతంగా బౌలింగ్ చేసినా… ఫీల్డర్లు తమ బాధ్యతను నిర్వర్తించకుంటే మ్యాచ్ మొత్తం మారిపోతుంది. ఫలితం తారుమారు అవుతుంది. అందువల్లే జట్లు ఫీల్డింగ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాయి.
న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా దారుణమైన ఫీల్డింగ్ చేస్తోంది. అందరూ యువ ప్లేయర్లే అయినప్పటికీ క్యాచ్ లు జార విడవడం.. రన్ అవుట్ లను మిస్ చేయడంతో న్యూజిలాండ్ బ్యాటర్లు జీవదానాలను పొందారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దీంతో న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ దిశగా పరుగులు పెడుతోంది.
న్యూజిలాండ్ జట్టులో మిచెల్(74), ఫిలిప్స్ (44) స్కోరు వద్ద ఆడుతున్నారు. వీరిద్దరూ ఇప్పటివరకు నాలుగో వికెట్ కు ఏకంగా వంద పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోర్ ఈ కథనం రాసే సమయం వరకు మూడు వికెట్ల నష్టానికి 158 పరుగులుగా నమోదయింది. ఓపెనర్లు కాన్వే(5), నికోల్స్(0) విఫలమైనప్పటికీ.. యంగ్ (30) పర్వాలేదు అనిపించాడు. వీరు ముగ్గురు ఔట్ అయినప్పటికీ న్యూజిలాండ్ జట్టు ఏమాత్రం వెనుకడుగు వేయలేదు.. ముఖ్యంగా మిచెల్ ఈ టోర్నీలో భీకరమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. మూడో మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ చేసి తన సత్తా చూపించాడు. ఫిలిప్స్ కూడా హాఫ్ సెంచరీకి దగ్గరగా వచ్చాడు.. వీరిద్దరూ ఇండియన్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారు. న్యూజిలాండ్ జట్టుకు భారీ స్కోరు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ మ్యాచ్లో టీమిండియా బౌలింగ్ లోపంతో పాటు.. ఫీల్డింగ్ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ఏకంగా నాలుగు జీవధానాలను టీమిండియా ఫీల్డర్లు న్యూజిలాండ్ బ్యాటర్లకు ఇచ్చారంటే.. మన ఫీల్డింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏకంగా రెండు క్యాచ్ లు జారవిడిచారు. రెండు రనౌట్ లను మిస్ చేశారు. వీటిని న్యూజిలాండ్ బ్యాటర్లు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. ఆ తర్వాత భారత బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు. తద్వారా న్యూజిలాండ్ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఈ వేదిక మీద ఇండియాకు ఇప్పటివరకు ఓటమి లేకపోయినప్పటికీ.. భారత బౌలింగ్ మాత్రం ఇలాగే కొనసాగితే.. అభిమానులు షాక్ కు గురయ్యే ఫలితం వస్తుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు గూగుల్ ప్రిడిక్షన్ అంతకంతకు న్యూజిలాండ్ వైపు మొగ్గు చూపిస్తోంది. న్యూజిలాండ్ జట్టుకు గెలిచే శాతం 31 గా ఉందని గూగుల్ పేర్కొనడం విశేషం. మ్యాచ్ ప్రారంభంలో ఇది తక్కువ స్థాయిలో ఉంది. కానీ న్యూజిలాండ్ జట్టు బ్యాటర్లు సమర్ధవంతంగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో… విజయావకాశాలు మెరుగుపడుతున్నాయని గూగుల్ ప్రిడిక్షన్ చెబుతోంది.
