Ishan Kishan: టాస్ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. లక్ష్యం భారీగా ఉండడంతో.. టీమిండియా ఓపెనర్లు అభిషేక్ శర్మ, సంజు శాంసన్ అదరగొడతారని అందరూ అనుకున్నారు. దీనికి తోడు తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో అతడు భీభత్సంగా బ్యాటింగ్ చేస్తాడని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ న్యూజిలాండ్ బౌలర్లు అభిషేక్ శర్మకు ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. అతడిని గోల్డెన్ డక్ గా వెనక్కి పంపించారు. సంజు శాంసన్ (6) ను కూడా సింగిల్ డిజిట్ స్కోర్ కే అవుట్ చేశారు. దీంతో టీమ్ ఇండియా ఆరు పరుగులకే ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది.
ఈ దశలో వచ్చారు ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్.. ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్లో చూపించిన సామర్థ్యాన్ని.. కొనసాగించడం మొదలుపెట్టాడు.. న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. కేవలం 21 బంతులలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తద్వారా తన కెరీర్ లో న్యూజిలాండ్ జట్టుపై తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతడి దూకుడుతో.. టీమ్ ఇండియా స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ముఖ్యంగా హెన్రీ బౌలింగ్లో కిషన్ ఏకంగా 20 పరుగులు పిండుకున్నాడు. న్యూజిలాండ్ కెప్టెన్ సాంట్నర్ బౌలింగ్ లో కూడా హ్యాట్రిక్ ఫోర్లు కొట్టి తన సత్తా ఏమిటో చూపించాడు. ఈ కథనం రాసే సమయం వరకు ఇషాన్ 31 బంతులలో 76 పరుగులు చేశాడు. ఇందులో 11 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.
ఆరు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ ఇషాన్ కిషన్ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. ముఖ్యంగా న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్య కుమార్ యాదవ్ తో కలిసి రెండో వికెట్ కు 96 ( ఈ స్టోరీ రాసే సమయం వరకు) పరుగులు జోడించాడు. అది కూడా 40 బంతుల్లోనే ఇన్ని పరుగులు రావడం విశేషం.
ఇషాన్ కిషన్ న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కంటే ముందు దాదాపు రెండు సంవత్సరాలు పాటు జట్టుకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు తన సామర్థ్యం నిరూపించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాడు. ముఖ్యంగా డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించాడు. ఝార్ఖండ్ జట్టును విజేతగా నిలిపాడు. సారధిగా సూపర్ ఇన్నింగ్స్ ఆడి సరికొత్త చరిత్ర సృష్టించాడు. తద్వారా న్యూజిలాండ్ జట్టుతో జరిగే టి20 సిరీస్ కు ఎంపిక అయ్యాడు. ఆ తర్వాత తన ఫామ్ ఎలా ఉందో ప్రత్యర్థి బౌలర్లకు రుచి చూపించాడు. తొలి టీ 20 మ్యాచ్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో కిషన్ పై ఆరోపణలు వినిపించాయి. అయితే రెండవ మ్యాచ్లో మాత్రం అతడు తన విశ్వరూపం చూపించాడు. మరి కొద్ది రోజుల్లో టి20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో.. కిషన్ ఫామ్ లోకి రావడం సంచలనంగా మారింది.