Medaram Jatara Explained: తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల మేడారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జాతీయ మీడియాలో మార్మోగుతూ ఉంటుంది. అంతర్జాతీయ మీడియాలోనూ స్థానం సంపాదించుకుంటూ ఉంటుంది. ఇంతటి చరిత్ర.. ఇంతటి ఘన కీర్తి వెనక చాలా చరిత్ర ఉంది. ఈ చరిత్ర తెలుసుకోవాలంటే ఒక ఎనిమిది శతాబ్దాలు వెనక్కి వెళ్లాలి.
సమ్మక్క జాతర 8 శతాబ్దాల క్రితం నుంచే మొదలైంది. ఆదివాసులకు ఆరాధ్య దైవంగా సమ్మక్క సారలమ్మ నిలవడం అప్పుడే ప్రారంభమైంది. సమ్మక్క, సారలమ్మ, పగడిద్దరాజు, నాగులమ్మ, జంపన్నకు ఎటువంటి రూపాలు ఉండవు. కేవలం గద్దెల రూపంలోనే వీరికి పూజలు జరుగుతూ ఉంటాయి.. ఒకప్పుడు ఆదివాసీ దేవతల గద్దెలు ఇనుప గ్రిల్స్ మధ్య, వెదురు బొంగుల రూపంలో ఉండేవి. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఆ వనదేవతల గద్దెలను పునర్ నిర్మించింది. అప్పట్లో సమ్మక్క సారలమ్మ కు మాత్రమే ఈ గద్దెలు ఉండేవి. అనంతరం భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో ఆలయానికి సరికొత్త రూపం తీసుకొచ్చారు. సమ్మక్క, సారలమ్మకు దక్షిణం వైపు చిన్న గద్దెల రూపంలో పగిడిద్దరాజు, గోవిందరాజులు ఉండేవారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఈ గద్దెలు ఉన్న ప్రాంతాన్ని విస్తరించింది. గతంలో గద్దెలు ఉన్న విస్తీర్ణంలో కేవలం 2500 మంది భక్తులు మాత్రమే ఉండడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు గద్దెలను విస్తరించిన తర్వాత 9,000 మంది దాకా భక్తులు ఉండడానికి అవకాశం ఏర్పడింది. దీనికి తోడు సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలను ఒకే వరుసలోకి తీసుకొచ్చాడు. ముందుగా భక్తులు నాగులమ్మ గద్దె వద్ద పూజలు చేస్తారు. ఆ తర్వాత వరుసగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకుంటారు. భక్తుల మొక్కులు చెల్లించుకుని సాఫీగా బయటికి వెళ్లే విధంగా ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వరదేవతల చుట్టూ గ్రానైట్ రాతితో నిర్మాణాలను రూపొందించింది. అంతేకాకుండా, సమ్మక్క వంశ చరిత్ర తెలిసే విధంగా గ్రానైట్ రాతి మీద తోరణాలు ఏర్పాటు చేసింది. నాలుగు గద్దెల చుట్టూ 32 గ్రానైట్ స్తంభాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. వాటి మీద ఆదివాసి సంస్కృతి, ఆచారాలు తెలిపే విధంగా చిహ్నాలు రూపొందించింది. ఈ స్తంభాల మీద సుమారు 750 మంది కోయ వంశీయుల పేర్లకు సంబంధించిన ఏడు వేలకు పైగా శిల్పాలను రూపొందించారు. సమ్మక్కతోపాటుగా మిగతా ఆదివాసీల గోత్రాలను.. వారి వ్యవహారాలను చిత్రాలుగా రూపొందించారు. రాతి స్తంభాల మధ్య గతంలో వెదురు బొంగుల రూపంలో ఉన్న అమ్మవార్ల ప్రధాన రూపాలను యధావిధి గానే ఉంచారు.. సూర్యచంద్రులు, నెలవంక, త్రిశూలం, బండి చక్రాలు, కంకవనం, నిలువు గీతలు వంటి వాటిని రాతి స్తంభాల మీద చెక్కారు
గొట్టు గోత్రాలు ఎలా ఉన్నాయి అంటే
సారలమ్మ వంశానిది మూడవ గొట్టు. ఈమె వంశవృక్షం ఇప్ప. పూజిత వృక్షం కస్సు.
పగిడిద్దరాజు, గోవిందరాజు నాలుగవ గొట్టు గోత్రానికి చెందినవారు. వీరి దేవతావృక్షం మద్ది. పూజిత వృక్షం బూరుగ.
సమ్మక్క వంశానిది ఐదవ గొట్టు గోత్రం. వీరి దేవతావృక్షం వెదురు. పూజిత వృక్షం మారేడు.
బేరంబోయిన రాజు వంశం గోత్రం ఆరవగొట్టు. వీరి దేవతావృక్షం బండారి. పూజిత వృక్షం వేపచెట్టు.
సిద్దబోయిన వంశం వారి గోత్రం ఎనిమిదవ గొట్టు. వీరి దేవతావృక్షం నెమలి నారా. పూజిత వృక్షం మర్రి.