India Vs England: 6 ఇన్నింగ్స్ లు.. 77 పరుగులు.. అతడి ఆట ఇక మారదా?

జో రూట్.. ఇంగ్లాండ్ సంచలనం.. అండ్రూ ప్లింటాఫ్ తర్వాత ఆ స్థాయిలో ఇంగ్లాండ్ జట్టుకు దొరికిన ఆణిముత్యం. భారత జట్టుతో హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి జో రూట్ ఐదు వికెట్లు తీశాడు.

Written By: Suresh, Updated On : February 21, 2024 11:42 am
Follow us on

India Vs England: అతడేం అనామక ఆటగాడు కాదు. మంచినీళ్ల ప్రాయంగా సెంచరీలు కొట్టిన బ్యాటర్. రికార్డు స్థాయిలో చేజింగ్ చేసిన హిట్టర్. బంతిని కసికొద్ది బాదే క్రికెటర్. ఎలాంటి సందర్భంలోనైనా ఎదురుదాడికి దిగే ఫినిషర్. అలాంటి ఆటగాడు భారత జట్టుతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో విఫలమవుతున్నాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఇంగ్లాండ్ జట్టుకు అక్కరకు రాకుండా పోతున్నాడు. ఆరు ఇన్నింగ్స్ ల్లో 77 పరుగులు మాత్రమే చేసి పేలవమైన బ్యాటరుగా చెత్త రికార్డు నమోదు చేసుకున్నాడు. ఇంతకీ ఎవరతను?

జో రూట్.. ఇంగ్లాండ్ సంచలనం.. అండ్రూ ప్లింటాఫ్ తర్వాత ఆ స్థాయిలో ఇంగ్లాండ్ జట్టుకు దొరికిన ఆణిముత్యం. భారత జట్టుతో హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లో కలిపి జో రూట్ ఐదు వికెట్లు తీశాడు.. పార్ట్ టైం స్పిన్నర్ అయినప్పటికీ మూడు టెస్టుల్లో ఓవర్లకు పైగా బౌలింగ్ చేశాడు. బౌలింగ్ విషయం పక్కనపెడితే బ్యాటింగ్లో రూట్ వైఫల్యం కొనసాగుతోంది. ఇంగ్లాండ్ జట్టులో ప్రస్తుతం ఉన్న ఆటగాళ్ల అందరితో పోలిస్తే రూట్ టెస్టుల్లో చేసిన పరుగులే ఎక్కువ. అతడి వైఫల్యం ఇంగ్లాండ్ జట్టు కొంపముంచుతోంది. బౌలింగ్ భారం రూట్ బ్యాటింగ్ పై ప్రభావం చూపిస్తోందని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.

” మీరు అభిమానించే అత్యుత్తమ బ్యాటర్ నిజమైన ఆల్ రౌండర్ గా ఉండాలని.. కోరుకోండి తప్పులేదు. కానీ అతడు అందరికంటే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేస్తే.. అతడి బ్యాటింగ్ నుంచి మంచి అవుట్ పుట్ ఆశించకండి” అంటూ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మార్క్ బౌచర్ ఇటీవల మూడో టెస్ట్ ముగిసిన అనంతరం జో రూట్ ఆట తీరును ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. జో రూట్ తో ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయించడం వల్ల అతడు సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని.. ఇంగ్లాండ్ కెప్టెన్ ఈ విషయంలో ఆలోచించాలని పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. “ఇంగ్లాండ్ జట్టులో నాణ్యమైన బౌలర్లు లేరా? జో రూట్ మాత్రమే ఉన్నాడా? అతడిని బ్యాటింగ్ కు కదా ఉపయోగించుకోవాల్సింది? ఇలాంటి సమయంలో బౌలింగ్ చేయించడం ఏంటి” అని పలువురు క్రీడా విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. మార్క్ బౌచర్ చేసిన వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు.

మూడో టెస్ట్ నేపథ్యంలో బలహీనమైన స్పిన్ ఎటాకింగ్ తో వెళ్లడం మూర్ఖత్వమని ఇంగ్లాండ్ జట్టుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ముఖ్యంగా యశస్వి జైస్వాల్ ఎటాకింగ్ ఆట తీరు ప్రదర్శించినప్పటికీ ఇంగ్లాండ్ కెప్టెన్ బౌలింగ్ కూర్పులో వైవిధ్యం చూపించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆటతీరు, ఆటగాళ్లతో ఆడించే తీరును మార్చుకోకుండా ఎంపైర్ కాలింగ్ పై విమర్శలు చేయడం మానుకోవాలని స్టోక్స్ కు సీనియర్లు హితవు పలుకుతున్నారు.. మరి నాలుగో టెస్ట్ మ్యాచ్ లో నైనా స్టోక్స్ తన తీరు మార్చుకుని రూట్ ను వినియోగించుకుంటాడా? రూట్ ను “ఓ రూట్” లో పెడతారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు స్టోక్స్ నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు