https://oktelugu.com/

IND Vs ENG: భారత్ కు మూడు.. ఇంగ్లాండ్ కు మిగిలింది గుండు సున్నా..

టీ -20 సిరీస్ ను గెలుచుకున్న టీమిండియా.. వన్డే సిరీస్ లోనూ అదే జోరు చూపించింది. అహ్మదాబాద్ వన్డే లోనూ 142 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, సిరీస్ ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఈ గెలుపుతో చాంపియన్స్ ట్రోఫీలోకి ధైర్యంగా అడుగుపెట్టింది.

Written By: , Updated On : February 12, 2025 / 09:11 PM IST
IND Vs ENG (5)

IND Vs ENG (5)

Follow us on

IND Vs ENG: ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగులు చేసింది. గిల్(112), కోహ్లీ (52), శ్రేయస్ అయ్యర్(78) అదరగొట్టారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్ (4/64) నాలుగు వికెట్లు సొంతం చేసుకున్నాడు. మార్క్ వుడ్ (2/45) ఫ్రెండ్ వికెట్లు పడగొట్టాడు. సకిబ్ మహమ్మద్, గస్ అట్కిన్సన్, జో రూట్ తలా ఒక వికెట్ సాధించారు. భారత్ విధించిన లక్ష్యాన్ని చేధించడంలో ఇంగ్లాండ్ జట్టు విఫలమైంది. 34.2 ఓవర్లలో 214 పరుగులకు కుప్ప కూలింది. బాంటన్(38), అట్ కిన్ సన్(38) పరుగులు చేసి టాప్ స్కోరర్లు గా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు పడగొట్టారు. వాషింగ్టన్ సుందర్, కులదీప్ యాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు.

మెరుగైన ఆరంభం ఇచ్చినప్పటికీ

భారత్ విధించిన భారీ టార్గెట్ ను చేజ్ చేయడానికి ఇంగ్లాండ్ జట్టు రంగంలోకి దిగింది. ఆ జట్టు ఓపెనర్లు దూకుడుగా ఆడారు. కేవలం ఆరు ఓవర్లలోనే 60 పరుగులు చేశారు. అర్ష్ దీప్ సింగ్ వరుస ఓవర్లలో బెన్ డకెట్ (34), సాల్ట్(23) ను అవుట్ చేశాడు. దీంతో 60 పరుగుల వద్ద తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. బాంటన్ భారీ షాట్లతో ఎదురు దాడికి దిగాడు. రూట్ తో కలిసి భారత బౌలర్ల పై విరుచుకు పడేందుకు ప్రయత్నించాడు. అయితే అతడిని కులదీప్ యాదవ్ అవుట్ చేశాడు. రూట్ అక్షర్ పటేల్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..బ్రూక్, బట్లర్ ను వరుస ఓవర్లలో హర్షిత్ రాణా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు 161 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది.. లివింగ్ స్టోన్ ను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేశాడు. ఆదిల్ రషీద్, మార్క్ వుడ్(9) ను హార్దిక్ పాండ్యా వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. వికెట్లు పడుతున్నప్పటికీ అట్ కిన్ సన్ భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే అక్షర్ పటేల్ అతడిని అవుట్ చేసి.. ఇంగ్లాండ్ జట్టుకు సున్నాను మిగిల్చాడు.