Laila (1)
Laila: కొన్ని సినిమాలు ప్రమోషనల్ కంటెంట్ కంటే ఎక్కువగా , వివాదాల వల్ల పాపులారిటీ ని పెంచుకుంటూ ఉంటాయి. ఆ పాపులారిటీ తో మార్కెట్ చేసుకోవడానికి హీరోలు, నిర్మాతలు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ(Ramgopal Varma) గత దశాబ్ద కాలం పైగా ఈ ఫార్ములా ని నమ్ముకొని కెరీర్ ని నెట్టుకుంటూ వచ్చాడు. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కూడా ఒక విధంగా ఈ ఫార్ములా ని వాడుకొనే సక్సెస్ అయ్యాడు, విశ్వక్ సేన్(Vishwak Sen) కెరీర్ కూడా ఇలాగే మొదలైంది. తన ప్రతీ సినిమాకి ప్రొమోషన్స్ సమయంలో ఎదో ఒక హడావుడి చేసి, జనాల్లో తన సినిమావైపు అటెన్షన్ తెచ్చుకునేలా చేస్తాడు. ఇప్పుడు ‘లైలా'(Laila Movie) సినిమాకి ఆయన ప్లాన్ చేసుకొని ఏమి చేయలేదు కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆ చిత్రంలో కమెడియన్ గా చేసిన పృథ్వీ రాజ్ వైసీపీ ని ఉద్దేశించి చేసిన నెగటివ్ కామెంట్స్ ఈ సినిమా తలరాతని మార్చేసింది అని చెప్పొచ్చు.
వైసీపీ అభిమానులు ‘#BoycottLaila’ అనే హ్యాష్ ట్యాగ్ తో పెద్ద ఎత్తున ట్విట్టర్ లో ట్రెండ్ చేసి లైలా సినిమా కి పరోక్షంగా ప్రొమోషన్స్ చేశారు. బాయ్ కట్ చేయమనగానే చేసేయడానికి ఎవ్వరూ సిద్ధంగా ఉండరు. సినిమా బాగుంటే సక్సెస్ అవ్వకుండా ఎవ్వరూ ఆపలేరు, ఈ చిన్న సూత్రం తెలుసుకోకుండా వైసీపీ అభిమానులు లైలా చిత్రానికి బోలెడంత పబ్లిసిటీ ఇచ్చారు. ఈ సినిమా ఒకటి ఉంది అనే విషయం తెలియనోళ్లకు కూడా తెలిసేలా చేసారు. మూడు రోజుల్లో దాదాపుగా 3 లక్షలకు పైగా ట్వీట్స్ వేశారు. అయితే విశ్వక్ సేన్ పొరపాటు జరిగిపోయింది, ఆ పృథ్వీ రాజ్ తో మాకు ఎలాంటి సంబంధం లేదు, దయచేసి మా సినిమాని చంపొద్దు అంటూ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. కానీ వైసీపీ అభిమానులు శాంతించలేదు, ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు.
దీంతో చిర్రెత్తిపోయిన విశ్వక్ సేన్, నా వెంట్రుక కూడా పీకలేరు అనే అర్థం వచ్చేలా ఒక ఫోటో పెట్టాడు. ఇది ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. దీంతో ‘లైలా’ చిత్రానికి ఫ్రీ పబ్లిసిటీ తారాస్థాయికి చేరుకుంది. ఇది చాలు టికెట్స్ హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయని అందరూ అనుకున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ హైదరాబాద్ లో దాదాపుగా అన్ని థియేటర్స్ లో ప్రారంభం అయ్యాయి. ఒక్క చోట కూడా హౌస్ ఫుల్ షో నమోదు కాలేదు. నెగటివ్ క్యాంపైన్ నీ సినిమా ఒకటి ఉందని జనాలకు తెలిసేలా చేస్తుందేమో కానీ, టికెట్స్ తెగవు అనేది అర్థం చేసుకోవాలి. ఈ సినిమా విషయం లో అదే జరిగింది. ప్రమోషనల్ కంటెంట్ కి ఆడియన్స్ లో నెగటివ్ అభిప్రాయం ఏర్పడడం వల్లే అడ్వాన్స్ బుకింగ్స్ ఇంత వీక్ గా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ పాజిటివ్ టాక్ వస్తే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.