Ravichandran Ashwin : సొంత మైదానంలో చేశాడని కాదు.. బంగ్లా పై సెంచరీ అశ్విన్ కు జీవితాంతం గుర్తుంటుంది.. ఎందుకంటే?

టాప్ ఆర్డర్ విఫలమైన చోట.. బంగ్లా బౌలర్లు రెచ్చిపోతున్నచోట.. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిలబడ్డాడు. సొంత మైదానంలో సెంచరీ చేశాడు. రవీంద్ర జడేజా తో కలిసి కదం తొక్కాడు. ఈ సెంచరీ అతడికి జీవితాంతం గుర్తుంటుంది. సొంత మైదానంలో చేశాడని కాదు.. దాని వెనుక గుండెను మెలిపెట్టే కారణం ఉంది.

Written By: Anabothula Bhaskar, Updated On : September 20, 2024 11:23 am

Ravichandran Ashwin

Follow us on

Ravichandran Ashwin : గురువారం బంగ్లాదేశ్ తో ప్రారంభమైన తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో సెంచరీ చేసిన రవిచంద్రన్ అశ్విన్ పేరు మీడియా, సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. గురువారం నాడు చేసిన శతకం టెస్ట్ క్రికెట్లో అతడికి ఆరవ సెంచరీ. భారత టాపార్డర్ విఫలమైనచోట అతడు నిలబడ్డాడు. భారత జట్టును నిలబెట్టాడు. బంగ్లా బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. రవీంద్ర జడేజాతో జత కలసి 195 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీటన్నిటికంటే అతడి తండ్రి ముందు సెంచరీ చేశాడు. కొడుకు చేసిన సెంచరీ చూసి అశ్విన్ తండ్రి భావోద్వేగానికి గురయ్యాడు. గ్యాలరీ నుంచి మ్యాచ్ చేస్తూ.. అశ్విన్ బ్యాటింగ్ ను అభినందించాడు.. అనుక్షణం ఆస్వాదించాడు. అశ్విన్ బౌండరీలు కొడుతుంటే ఎగిరి గంతేసాడు. సిక్సర్లు బాదుతుంటే ఉప్పొంగిపోయాడు. సెంచరీ పూర్తి చేసిన అనంతరం అశ్విన్ కేరింతలు కొట్టాడు. గ్యాలరీలో తననే చూస్తున్న తండ్రిని ఉద్దేశించి.. సాధించానన్నట్టుగా బ్యాట్ ఊపాడు..

తండ్రి పాత్ర కీలకం

రవిచంద్రన్ అశ్విన్ అత్యుత్తమ క్రికెటర్ గా ఆవిర్భవించడం వెనక అతని తండ్రి రవిచంద్రన్ పాత్ర కీలకమైనది. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ జట్టుతో సిరీస్ జరుగుతున్నప్పుడు అశ్విన్ తల్లి అనారోగ్యానికి గురైంది. ఆ సమయంలో రవిచంద్రన్ ఆమె బాగోగులు చూసుకున్నాడు. మధ్యలో ఒకరోజు బీసీసీఐ అనుమతి తీసుకుని ప్రత్యేక విమానంలో అశ్విన్ చెన్నై వెళ్ళాడు. ఆ తర్వాత మరుసటి రోజు అశ్విన్ ను క్రికెట్ ఆడేందుకు రవిచంద్రన్ పంపించాడు.. తన భార్యను చూసుకుంటూ.. కొడుకు దేశం కోసం ఆడాలనే పట్టుదలతో పంపించాడు.. తండ్రి ఇచ్చిన మద్దతుతో అశ్విన్ జట్టులోకి పునరాగమనం చేశాడు. అలాంటి త్యాగాలు రవిచంద్రన్ చేశాడు కాబట్టే అశ్విన్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాడు. తన తండ్రి త్యాగం వల్లే తాను ఈ స్థాయిలో ఎదిగానని గతంలో పలు ఇంటర్వ్యూలలో అశ్విన్ చెప్పుకొచ్చాడు. ” మా నాన్న లేకుంటే నేను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. ఆయన నాకోసం ఎన్నో త్యాగాలు చేశారు. నేను గొప్ప క్రికెటర్ అయ్యేందుకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆయన విజయాన్ని.. నా ఎదుగుదలను చూసుకున్నారు. నా రోల్ మోడల్ ఆయనే” అని పలు ఇంటర్వ్యూలలో రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. కాగా, రవిచంద్రన్ అశ్విన్ సెంచరీ చేయగానే.. భారత ఆటగాళ్లు మొత్తం అతడికి స్టాండింగ్ ఓవేషన్ తో గౌరవించారు. తొలిరోజు ఆట ముగిసిన తర్వాత అశ్విన్ డ్రెస్సింగ్ రూమ్ లో వచ్చిన అనంతరం అతడిని అభినందనలతో ముంచెత్తారు. కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగా ఆలింగనం చేసుకొని ప్రశంసల జల్లు కురిపించాడు.