YCP in difficult Situation : తాజా రాజకీయ పరిణామాలతో వైసీపీలో కలవరం ప్రారంభమైంది. ఒకవైపు పార్టీ సీనియర్లు షాక్ ఇస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. జగన్ సన్నిహిత నేతలు సైతం గుడ్ బై చెబుతున్నారు. వైయస్సార్ కుటుంబ విధేయులు సైతం ముఖం చాటేస్తున్నారు. ఇంకోవైపు కూటమి ప్రభుత్వం నుంచి ఆరోపణలు, కేసులతో మరికొంతమంది ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీంతో జగన్ అప్రమత్తమయ్యారు. పార్టీ సీనియర్లతో వరుసగా సమీక్షలు జరుపుతున్నారు. వారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించారు. రాజకీయంగా వస్తున్న ఆరోపణలపై కూడా సీనియర్ నేతలతో చర్చిస్తున్నారు. వాటిపై ఎలా ముందుకెళ్లాలో కూడా ఆలోచన చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదు జగన్. అయితే ఈసారి అప్రమత్తంగా లేకుంటే పార్టీ పూర్తిగా నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
* పార్టీలో గందరగోళం
వైసీపీలో ఒక రకమైన అనీశ్చితి కనిపిస్తోంది. జగన్ తో పాటు వైయస్సార్ కుటుంబానికి సన్నిహితమైన నేతలు పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆ జాబితాలో మరికొంతమంది ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో జగన్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. పార్టీని తిరిగి యాక్టివ్ చేసే క్రమంలో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలకు అధ్యక్షులుగా సీనియర్లను నియమించారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడడంతో ప్రకాశం జిల్లా నేతలతో సమీక్ష జరపనున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బూచేపల్లిని ఖరారు చేసే అవకాశం ఉంది.
* ఉత్తరాంధ్ర పై ఫోకస్
ఉత్తరాంధ్ర పై జగన్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఎన్నికల్లో అక్కడ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కలేదు. అందుకే అక్కడ పార్టీ అధ్యక్షులుగా సీనియర్లను నియమించాలని భావించారు. శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణ దాసు, విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడిగా శత్రుచర్ల పరీక్షిత్ రాజు పేరును జగన్ ఖరారు చేశారు. శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకుడిగా తమ్మినేని సీతారాంను నియమించారు.
* మెడకు టిటిడి లడ్డూ వివాదం
మరోవైపు టీటీడీ లడ్డూ తయారీలో వైసీపీ సర్కార్ పై వచ్చిన ఆరోపణల పై ఫుల్ ఫోకస్ పెట్టారు జగన్. టీటీడీ మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి తో సమావేశం అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చారు వైవి. ఈ ఐదేళ్లపాటు టీటీడీ పవిత్రతను కాపాడేలా వ్యవహరించామని జగన్ కు చెప్పుకొచ్చారు. టీటీడీ లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యి అపవిత్రమైనదని ఓ ల్యాబ్ రిపోర్ట్ లో తేలడంతో టిడిపి ఆరోపణలు చేస్తోంది. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. దీనిని ఎలా ఎదుర్కోవాలో జగన్ సీనియర్లతో చర్చలు జరుపుతుండడం విశేషం.