IND Vs AUS Test : తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేసిన అతడు.. రెండవ ఇన్నింగ్స్ లోనూ అదే స్కోర్ చేశాడు. ఫలితంగా టీమ్ ఇండియాకు ఇన్నింగ్స్ ఓటమిని తప్పించాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 180 పరుగులకే కుప్పకూలింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 337 రన్స్ చేసింది. ఫలితంగా భారత్ పై 157 పరుగుల లీడ్ దక్కించుకుంది. ఇక రెండవ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. 175 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ లోనూ తెలుగు ఆటగాడు 42 పరుగులు చేశాడు. అందువల్లే ఆస్ట్రేలియా ముందు భారత్ 19 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది. లేకపోతే భారత్ కు ఇన్నింగ్స్ ఓటమి ఎదురయ్యేది. అడిలైడ్ పింక్ బాల్ టెస్ట్ లో భారత్ ఓడిపోయినప్పటికీ.. కాస్తో కూస్తో రిలీఫ్ దక్కిందంటే దానికి కారణం నితీష్ కుమార్ రెడ్డి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తొలి ఇన్నింగ్స్ లో అతడు 42 పరుగులు చేశాడు. ఒక వికెట్ కూడా సాధించాడు. రెండవ ఇన్నింగ్స్ లోనూ 42 పరుగులు చేసి భారత్ పరువును కాపాడాడు. లేకుంటే ఓటమి మరింత దారుణంగా ఉండేది..
కీలక ఆటగాళ్ల వైఫల్యం
తొలి ఇన్నింగ్స్ లో విఫలమైన భారత ఆటగాళ్లు.. రెండవ ఇన్నింగ్స్ లోనూ అదే ధోరణి కొనసాగించారు. ముఖ్యంగా రోహిత్, విరాట్ కోహ్లీ, రాహుల్ దారుణంగా విఫలమయ్యారు. వీరు గనక ఎంతో కొంత స్కోర్ చేసి ఉంటే భారత్ పరిస్థితి మెరుగ్గా ఉండేది. అప్పుడు అడిలైడ్ టెస్ట్ ను శాసించేది. కానీ ఆస్ట్రేలియా బౌలర్ల ఎదుట వారు చేతులెత్తేయడంతో.. ఆ ప్రభావం జట్టు స్కోర్ పై పడింది. ” పెర్త్ లో 295 రన్స్ తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ పై ఓటమి తర్వాత భారత్ గాడిన పడింది అనుకున్నాం. కానీ అదంతా ఉత్తిదేనని నిరూపించారు టీమిండియా ఆటగాళ్లు. పెర్త్ లో గెలిచిన ఆటగాళ్లు.. అడిలైడ్ కు వచ్చేసరికి తేలిపోయారు. ముఖ్యంగా ఆప్ స్టంప్ దిశగా ఆస్ట్రేలియా బౌలర్లు వేసిన బంతులను అనవసరంగా వెంటాడి.. అవుట్ అయ్యారు. విరాట్ కోహ్లీ ఇలానే అవుటయి మరోసారి తన వైఫల్యం నిరూపించుకున్నాడు. రోహిత్ కూడా క్రీజ్ లో ఉండడానికే ఇబ్బంది పడ్డాడు. దారుణంగా క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాహుల్ కూడా అత్యంత అసౌకర్యవంతంగా కనిపించాడు. ఇలా కీలక ఆటగాళ్లు అవుట్ అయితే.. జట్టు ఎలా విజయం సాధిస్తుంది.. ఇప్పటికైనా టీమిండియా ఆటగాళ్లు తమ ఆటతీరును మార్చుకోవాలి. లేకుంటే ఆస్ట్రేలియా వేదికగా వచ్చే టెస్టులలో భారీ మూల్యాన్ని టీమిండియా చెల్లించుకోవాల్సి ఉంటుందని” క్రికెట్ విశ్లేషకులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.