IND vs AUS
IND vs AUS : ఈ సిరీస్లో భారత్ బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లను ఓడించి సెమీఫైనల్ చేరుకుంది..గ్రూప్ – ఏ లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై చేజింగ్ లో, న్యూజిలాండ్ పై స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడంలో భారత్ విజయవంతమైంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై భారత బౌలర్లు సమష్టి ప్రదర్శన చేయగా.. న్యూజిలాండ్ జట్టుపై స్పిన్నర్లు ఏకపక్ష ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఏకంగా 128 డాట్ బాల్స్ వేశారు. దీంతో ఆస్ట్రేలియాతో జరిగే సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ నలుగురు స్పిన్నర్లతో రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తికి సెమీఫైనల్ మ్యాచ్లో చోటు లభించే అవకాశం కనిపిస్తోంది. కులదీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ తో భారత స్పిన్ దళం బలంగా కనిపిస్తోంది.. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కులదీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ ఒక వికెట్ తో పాటు, 40+ పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా ఒక్క వికెట్ మాత్రమే తీయగలిగాడు. రోహిత్ శర్మ నుంచి మొదలు పెడితే హార్దిక్ పాండ్యా వరకు బ్యాటింగ్ దళం బలంగా ఉంది. అయితే న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా మాత్రమే రాణించారు. ఆస్ట్రేలియా తో జరుగుతున్న మ్యాచ్లో ఇలాంటి తడబాటుకు గురైతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు.
ప్లేయింగ్ -11 ఎలా ఉందంటే
దుబాయ్ మైదానం భారత జట్టుకు హోం గ్రౌండ్ గా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. న్యూజిలాండ్ తో ఇదే మైదానం వేదికగా మ్యాచ్ జరిగింది. ఒక రకంగా ఇది టీమిండియా కు అడ్వాంటేజ్ గా మారనుంది. మరోవైపు ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై మాత్రమే పూర్తి స్థాయిలో మ్యాచ్ ఆడింది. దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో జరగాల్సిన మ్యాచులు వర్షం వల్ల రద్దయ్యాయి. దీంతో ఆ జట్టు కు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ లేకుండా పోయింది. దుబాయ్ మైదానం పూర్తిస్థాయిలో స్పిన్ బౌలర్లతో అనుకూలించే అవకాశం ఉంది. కొద్దిరోజులుగా అక్కడ ఎండ తీవ్రంగా ఉంది. అందువల్ల మంచు కురవదని తెలుస్తోంది. ఛాంపియన్ ట్రోఫీలో ఇప్పటివరకు ఈ మైదానంపై మూడు మ్యాచ్లు జరగగా.. మూడుసార్లు ప్రత్యర్థి జట్లే టాస్ గెలిచాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా.. న్యూజిలాండ్ బౌలింగ్ వైపు మొగ్గు చూపింది. ఈ మూడు సార్లు టాస్ ఓడిపోయినప్పటికీ భారత్ గెలిచింది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్(వైస్ కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, కులదీప్ యాదవ్, మహమ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా; స్మిత్ (కెప్టెన్), హెడ్, ఇంగ్లిస్, లబూ షేన్, కూపర్, క్యారీ, ద్వార్షిస్, మాక్స్ వెల్, ఎల్లిస్, జంపా, జాన్సన్.
Also Read : బ్యాటింగ్ కు వచ్చినా.. బౌలింగ్ కు రాని బుమ్రా.. అభిమానుల్లో ఆందోళన!