Ind Vs Aus Live Score: చాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియాలోకి అడుగుపెట్టారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. చాలా కాలం తర్వాత వారిద్దరు జట్టులోకి రావడంతో అభిమానులు అంచనాలు పెరిగిపోయాయి. దీనికి తోడు రోహిత్ ఈసారి తన బరువును కోల్పోయి అత్యంత నాజూకుగా కనిపించాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టాడు. పైగా ఇటీవల ప్రాక్టీస్ లో తను కొట్టిన బంతి ఏకంగా లంబోర్గిని కారు అద్దాలను బద్దలు కొట్టేసింది. దీనికి తోడు రోహిత్ తన కెరియర్లో 500 వ వన్డే మ్యాచ్ ఆడుతున్నాడు. దీంతో అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. విరాట్ కోహ్లీ కూడా నేరుగా లండన్ నుంచి రావడంతో అతను కూడా బీభత్సంగా ఆడతాడని అందరూ అనుకున్నారు.
అభిమానులలో అంచనాలు భారీగా ఉండగా.. వాటిని అందుకోవడంలో రోహిత్, విరాట్ విఫలమయ్యారు.. రోహిత్ మొదట్లో బంతులను ఎదుర్కోవడంలో విఫలమయ్యాడు. ఆ తర్వాత ఒక బౌండరీ సాధించి సౌకర్యవంతంగా కనిపించాడు. కానీ ఆ తర్వాత అతడు స్టార్క్ బౌలింగ్లో స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ పరిణామానికి మైదానంలో ఉన్న ప్రేక్షకులు మొత్తం దిగ్భ్రాంతికి గురయ్యారు. చూస్తుండగానే రోహిత్ పెవిలియన్ చేరుకోవడం అభిమానులను కలవరపరిచింది. రోహిత్ ఎనిమిది పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ హేజిల్ వుడ్ బౌలింగ్లో బంతిని అంచనా వేయలేక భారీ షాట్ కొట్టబోయాడు. అది కాస్త గల్లీలో లేవడంతో కూపర్ కన్నోలీ క్యాచ్ పట్టడంతో నిరాశతో మైదానం నుంచి వీడి వెళ్లిపోయాడు. విరాట్ కోహ్లీ ఒక పరుగు కూడా చేయకుండా అవుట్ కావడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ తరుణంలో వారిద్దరు వచ్చిన అవకాశాన్ని ఇలా చేజార్చుకోవడం పట్ల అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రోహిత్ తన కెప్టెన్సీ కోల్పోయాడు. జట్టులో సాధారణ ఆటగాడిగా మిగిలిపోయాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా తన మీద పెట్టుకున్న అంచనాలను అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో భారత్ చూస్తుండగానే ఒత్తిడిలో పడిపోయింది. 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ గిల్ కూడా అత్యంత నిరాశ జనకమైన బ్యాటింగ్ చేశాడు. పది పరుగులు చేసి ఎల్లీస్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. తద్వారా టీమిండియా 25 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది.