Ind vs Aus Odi 2025: వన్డేలలో టీమిండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. టి20లలో కూడా నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా ఇటీవల 3 t20 సిరీస్ లలో వరుస విజయాలు సాధించి సూపర్ ఫామ్ లో ఉంది. మొత్తంగా చూస్తే ఈ రెండు జట్లు అత్యంత బలమైనవి. ప్రస్తుత ప్రపంచ క్రికెట్ మొత్తాన్ని ఇవి రెండు శాసిస్తున్నాయి. ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే ఆటగాళ్లకు మాత్రమే కాదు, అభిమానులకు కూడా విపరీతమైన ఆసక్తి. ఆస్ట్రేలియా గడ్డమీద ఈ రెండు జట్లు 3 వన్డేలు, రెండు టి20 మ్యాచ్ల సిరీస్ లు ఆడబోతున్నాయి. అక్టోబర్ 19 నుంచి ఈ సమరం మొదలు కాబోతోంది.
వన్డేలకు, టి20 లకు భారత్ ఇటీవల జట్లను ప్రకటించింది. వన్డేలలో గిల్ నాయకత్వం వహిస్తుండగా.. టి20 మ్యాచ్ లకు సూర్య కుమార్ యాదవ్ సారధ్యం వహిస్తున్నాడు. ఇక ఆస్ట్రేలియా జట్టు కూడా వన్డేలకు, టి20 లకు జట్లను ప్రకటించింది. రెండు ఫార్మాట్లలో కూడా షాన్ మార్ష్ ఆస్ట్రేలియా జట్టును ముందుండి నడిపించబోతున్నాడు.. వన్డేలలో షాన్ మార్ష్, బార్ట్ లెట్, క్యారీ, కన్నోలీ, డ్వార్యిష్, ఎల్లిస్, గ్రీన్, హేజిల్ వుడ్, జోష్ ఇంగ్లిస్, ఓవెన్, రెయిన్ షా, షార్ట్, స్టార్క్, జంపా, హెడ్ లను మేనేజ్మెంట్ ఎంపిక చేసింది. వీరిలో హెడ్ నుంచి మొదలు పెడితే మార్ష్ వరకు బ్యాటింగ్లో భీకరమైన ఫామ్ లో ఉన్నారు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ లో కూడా వీరిద్దరూ అదరగొట్టారు. అంతకు ముందు జరిగిన వెస్టిండీస్ సిరీస్ లోను సత్తా చూపించారు. అక్టోబర్ 19, 23, 25 తేదీలలో భారత్, ఆస్ట్రేలియా మధ్య 3 వన్డేల సిరీస్ కొనసాగుతుంది. పెర్త్, అడిలైడ్, సిడ్ని వేదికలుగా ఈ మ్యాచ్లు జరుగుతాయి.
ఇక టి20లకు కూడా మార్ష్ నాయకత్వం వహించబోతున్నాడు. టి20 లలో కునేమాన్, స్టోయినిస్ అదనంగా చేరుతారు. ఇటీవల కాలంలో స్టోయినీస్ బీభత్సం సృష్టిస్తున్నాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. కనివిని ఎరుగని స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. అందువల్లే అతని మీద ఆస్ట్రేలియా భారీ అంచనాలు పెట్టుకుంది. మొత్తంగా చూస్తే భారత జట్టుకు గట్టి పోటీ ఇచ్చే విధంగా ఆస్ట్రేలియా మేనేజ్మెంట్ జట్లను ఎంపిక చేసింది. ఈ సిరీస్ ఆసాంతం అభిమానులకు అద్భుతమైన క్రికెట్ వినోదాన్ని అందిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియా మైదానాలు బ్యాటర్లతోపాటు బౌలర్లకు కూడా సహకరిస్తాయి. ఈ ప్రకారం చూసుకుంటే బంతి, బ్యాట్ మధ్య రసవత్తర పోరు జరుగుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రెండు జట్లలో హేమాహేమీలైన ప్లేయర్లు ఉన్నారు కాబట్టి పోటీ మొత్తం నువ్వా నేనా అన్నట్టుగా సాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక టి20 లలో, వన్డేలలో ఈ రెండు జట్ల మధ్య సమఉజ్జీ స్థాయిలో పోటీ జరుగుతుంది కాబట్టి.. ఈ సిరీస్ కూడా రసవత్తరంగా ఉంటుందని అంచనాలున్నాయి.